హరీష్ విషయంలో కేటీఆర్ భలే కవర్ చేస్తున్నారే..!

July 15, 2019

తెలంగాణ ఏర్పాటు నుంచి మొదలుకొని నేటివరకూ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ తర్వాత చక్రం తిప్పిన కీలక నేత హరీష్ రావు. ముఖ్యమంత్రి అల్లుడిగా, రాష్ట్రానికి మంత్రిగా ఆయన చేసిన సేవలు మరపురానివి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ చొరవను తెలంగాణ జనం ఏనాటికీ మరువలేరు. అయితే ఇంతటి అభిమానం, బలం ఉన్న హరీష్ రావు.. గతంలో జరిగిన ఎన్నికల తరువాత సైలెంట్ కావడం రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో పలు రకాల వార్తలు కూడా షికారు చేశాయి. అయితే ఆ తర్వాత కేసీఆర్, హరీష్ ఇద్దరూ ఈ విషయం పట్ల రియాక్ట్ కావడంతో అందరూ సైలెంట్ అయినా.. ఎక్కడో మూలన సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన బావ హరీష్ రావు పై సవాల్ విసరడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

కేటీఆర్ విషయానికొస్తే.. ఆయన సాధారణంగా ఆదివారాలు.. పండుగ వేళల్లో మీడియా మీట్ ఏర్పాటు చేయరు. కానీ అందుకు భిన్నంగా నిన్న పండుగ వేళ సెలవు అయినప్పటికీ.. మీడియా మీట్ ఏర్పాటు చేసి ఇష్టాగోష్టిగా మాట్లాడారు కేటీఆర్. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వందశాతం ఎంపీ సీట్లను గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. 16 ఎంపీ స్థానాల్ని టీఆర్ ఎస్ కైవశం చేసుకుంటుందని పేర్కొన్నారు. మెజార్టీ సాధించే విషయంలో మెదక్ మొదటి స్థానంలో, వరంగల్ రెండో స్థానంలో, కరీంనగర్ మూడో స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ నిలుస్తాయని చెప్పారు. ఈ మధ్యన మెజార్టీ విషయంలో బావ హరీశ్ తో సరదాగా సవాల్ విసిరానని.. అదంతా ప్రజల్ని ఉత్తేజపర్చటానికే చేసినట్లు చెప్పుకున్నారు. మెదక్ ముఖ్యమంత్రి అడ్డా అని, అక్కడ కచ్ఛితంగా టీఆర్ఎస్ కు భారీ మెజార్టీ వస్తుందన్నారు. మొత్తానికైతే.. సరదాగా కానీ సీరియస్ గా కానీ ఏదో విధంగా బావ హరీశ్ ప్రస్తావన తీసుకొచ్చి కేటీఆర్ భలేగా కవర్ చేస్తుంటారని చెప్పాలి. బావతో అంతా బాగుందని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడంతో పాటు ఆల్ ఈజ్ వెల్ అనిపించేలా చేయటంలో కేటీఆర్ టాలెంట్ ను మెచ్చుకోవాల్సిందే మరి. కాకపోతే ప్రజల్లో ఒకసారి వచ్చిన అనుమానం ఎప్పటికీ చెరిగిపోదనే విషయం మాత్రం జగమెరిగిన వాస్తవం.