KTR : కల్వకుంట్ల జర్నలిజం స్కూలు ఏమైనా పెట్టారా?

August 13, 2020

అధికారంలో ఉన్న వారు కోరుకున్నట్లే అన్ని జరగాలని కోరుకోవటం ఇటీవల కాలంలో ఎక్కువ అవుతోంది. సాధారణంగా విపక్షాలు.. మీడియాలు ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపాలని కోరుకునే అధికార పార్టీలు అంతకంతకూ కనుమరుగైపోతున్నాయి. విమర్శలు చేయటం అంటే.. డెవలప్ మెంట్ ను అడ్డుకోవటమే అన్న కొత్త కాన్సెప్టును తీసుకొస్తూ విస్మయానికి గురి చేస్తున్నాయి.

ప్రభుత్వాల్ని విమర్శించే వారిపై ఎదురుదాడి గతంలో చాలా పరిమితంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. అధికారపక్షానికి అనుకూలంగా అందరూ ఉండాలన్న కోరిక అంతకంతకూ పెరుగుతోంది. ఏ చిన్న విమర్శను సైతం తట్టుకోలేని రీతిలో ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఇందుకు తెలంగాణ అధికారపక్షం ఒక ఉదాహరణగా చెప్పాలి.

ఓవైపు నీతి మాటలు చెబుతూనే..తమ రాజకీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతాయన్న భావన కలిగినంతనే విమర్శలతో ఉతికి ఆరేయటం కేసీఆర్ సర్కారుకు ఎంత అలవాటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పొరుగున ఉన్నఏపీలో కరోనా విషయంలో అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు.. తెలంగాణలో అనుసరిస్తున్న వైఖరిని ఏ మాత్రం పొంతన లేదన్నది మర్చిపోకూడదు. నిత్యం ఐసీఎంఆర్ చెప్పినట్లే తాము చేస్తున్నట్లు చెప్పే తెలంగాణ సర్కారు.. ఇటీవల కాలంలో హైకోర్టు చేసిన సూచనల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరో అర్థం కాదు. మిగిలిన రాష్ట్రాల్లో కరోనా బులిటెన్లకు తెలంగాణలో విడుదల చేస్తున్న బులిటెన్లు చూస్తేనే ఎంత తేడా ఉందన్నది ఇట్టే అర్థమైపోతుంది.

అదొక్కటే కాదు.. నిర్దారణ పరీక్షల విషయంలో దేశంలోని చాలా రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ ఎందుకు వెనుకబడినట్లు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పరు. ఐసీఎంఆర్ చెప్పినప్పటికీ.. నేటికి ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్ కంటే కూడా.. క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నది మర్చిపోకూడదు. అదే పనిగా జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ మీడియాలో వస్తున్న కథనాలపై తెలంగాణ రాష్ట్ర సర్కారుకు చెందిన పలువురికి మింగుడుపడని పరిస్థితి.

మీడియాలో వచ్చిన లోపాల్ని సరి చేసుకుంటూ మరింత ముందుకు వెళ్లాల్సిన స్థానే.. నెగిటివ్ కంటే పాజిటివ్ మీదనే ఎక్కువగా చూడాలని పేర్కొనటం గమనార్హం. వైరస్ సోకిన వారిలో 2 శాతం మంది మాత్రమే మరణిస్తున్నారని.. 98 శాతం మంది కోలుకుంటున్న అంశాన్ని హైలెట్ చేయాలని చెప్పటం చూస్తే.. కేటీఆర్ ఏం కోరుకుంటున్నారో ఇట్టే అర్థమైపోతుంది.

దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో తరచూ పోల్చుకుంటూ.. తెలంగాణ తోపు అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఆయన అనుచరవర్గం.. కరోనా విషయంలో మరణాలు రేటు.. కేసుల నమోదు అత్యంత తక్కువగా ఉన్న కేరళ లాంటి రాష్ట్రంలో ఎందుకు పోల్చుకోరు? అన్నది ప్రశ్న. అదే పనిగా మీడియాలో తాము కోరుకున్నది మాత్రమే రావాలని కోరుకోవటం.. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశంపై తరచూ సలహాలు.. సూచనలు ఇచ్చే మంత్రి కేటీఆర్ తీరు చూస్తే.. ఎంతమాత్రం మింగుపడని రీతిలో ఉంటుందని చెప్పక తప్పదు.

తమలోని నెగిటివ్ కాకుండా పాజిటివ్ చూడాలనే కేటీఆర్.. మీడియా విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తుందన్న విషయాన్ని ఆయన ఎందుకు మర్చిపోతున్నట్లు?