నీకు సిగ్గనిపించలేదా అని మోడీ షాడోను అనేసిన కేటీఆర్

May 26, 2020

టీఆర్ఎస్ పైనా, ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా విమర్శలు సంధించే వారిపై... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, కేసీఆర్ కుమారుడిగా కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) చాలా వేగంగానే రియాక్ట్ అవుతారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నద్దా... టీఆర్ఎస్, కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. జేపీ నద్దాను ఏకంగా అబద్ధాల అడ్డాగా మార్చేసిన కేటీఆర్... నద్దాపై తనదైన శైలి పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లను సంధించారు. నద్దా కాస్తంత నెమ్మదిగానే విరుచుకుపడితే... కేటీఆర్ మాత్రం తనదైన శైలి దూకుడుతో నద్దాను చెడుగుడు ఆడేసుకున్నారని చెప్పక తప్పదు. నద్దాను ఏకంగా అబద్ధాల అడ్డాగా అభివర్ణించేసిన కేటీఆర్... ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని చదివేందుకు నద్దాను మనసెలా ఒప్పిందంటూ తనదైన రేంజిలో మండిపడ్డారు.

అయినా నద్దాపై కేటీఆర్ ఏ రేంజిలో ఫైరయ్యారన్న విషయానికి వస్తే... తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టిన నద్దా... రాష్ట్రం గురించి తెలుసుకోకుండా ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని చదివారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పడి ఏడుస్తున్నారని... కేంద్ర సంస్థలను అడిగి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలని కూడా కేటీఆర్ తనదైన శైలి పంచ్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీతి ఆయోగ్ ఎందుకు కితాబిచ్చిందో తెలుసుకోవాలని సూచించారు. ఇవేవీ తెలుసుకోకుండా నద్దా అడ్డగోలుగా మాట్లాడారని... ఆయనకు సిగ్గనిపించడం లేదా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నద్దా వ్యాఖ్యలను చూస్తుంటే... ఆయన జేపీ నడ్డా కాదని... పచ్చి అబద్ధాల అడ్డా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేసేవారు దమ్ముంటే వాటిని నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాదుకు ప్రధాని మోదీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించిన కేటీఆర్.. రాష్ట్రంలో కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి, ఆ చలిమంటల్లో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారని, వారిని ఎవరూ పట్టించుకోవద్దని చెప్పారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండటం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు నచ్చదని అన్నారు. మొత్తంగా నద్దా చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్లే ఇచ్చారన్న వాదన వినిపిస్తోంది.