ఏపీ రాజధాని గురించి కేటీఆర్ కామెంట్స్

February 22, 2020

ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ లీడర్ షిప్ ప్రజలకు కాస్త ఎక్కువ అందుబాటులో ఉందనుకోవాలి. ముఖ్యమంత్రుల నుంచి అధికారుల వరకు సాధారణ సమస్యలపై నేరుగా ఆన్ లైన్లో సంప్రదించినా పలికేటంత అందుబాటులో ఉంటారు. ఇక కేటీఆర్ అయితే... జనానికి ఒక ట్వీట్ దూరంలో ఉంటారు. కొన్నిటిని బహిరంగంగా పరిష్కరిస్తారు, ఇంకొన్నిటిని పరోక్షంగా పరిష్కరిస్తారు. కేటీఆర్ కు అపుడపుడు నెటిజన్లతో ఇంటరాక్ట్ అవడం ఓ సరదా. 

తాజాగా ఆస్క్ కేటీఆర్ పేరుతో మరోసారి నెటిజన్ల ముందుకు వచ్చారు కేటీఆర్. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఆంధ్ర రాజధాని మార్పు గురించి కేటీఆర్ ను అడిగారు. అయితే... కేటీఆర్ లౌక్యంగా తప్పించుకున్నారు. ’’ఏపీ రాజధానిని నిర్ణయించాల్సింది నేను కాదు, ఏపీ ప్రజలు‘‘ అన్నారు కేటీఆర్. 

పైకి కేటీఆర్ తనకు సంబంధం లేదన్నట్లు మాట్లాడినట్లు ఉన్నా... వాస్తవానికి ఈ జవాబులో ఓ నిగూడార్థం ఉంది. రాజధాని అన్నది పాలకుల అభిప్రాయం ప్రకారం కంటే కూడా ప్రజల అభిప్రాయం ప్రకారం నిర్ణయించాలన్న విషయాన్ని కేటీఆర్ చెప్పకనే చెప్పారు. జగన్ తను ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవడం కంటే ప్రజలకు నచ్చినట్టు వ్యవహరిస్తే మంచిదన్న సంకేతాన్ని ఇన్ డైరెక్టుగా ఇచ్చారు కేటీఆర్. మరి దీనిని అర్థం చేసుకోవాల్సింది జగనే.