కేటీఆర్ సార్.. మీరు చెబితే ఏపీ వాళ్లు వింటారా..?

May 31, 2020

అసెంబ్లీ ఎన్నికల తరహాలో లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించి రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి. అందుకోసం ఆ పార్టీ ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు గులాబీ బాస్, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. మరోవైపు, ఆయన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కూడా ఎన్నికల కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నారు. 16 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సన్నాహక సభలు నిర్వహిస్తున్నారు. వీటికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం మోగిస్తున్నారు. ఇప్పటికే పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు కూడా నిర్వహించారు. మరోవైపు, టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ వేలు పెడుతోంది. ఇందుకోసం ఆ పార్టీ తెర వెనుక రాజకీయం జరుపుతోంది. పరోక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతోంది గులాబీ పార్టీ.

ఇందులో భాగంగానే ఏపీలో తెలుగుదేశం పార్టీని ఓడించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక కేసీఆర్, కేటీఆర్ కూడా ఈ మధ్య తరచూ ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుకు వీడ్కోలు పలికేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏపీ ఎన్నికలలో ఎటువంటి ఫలితం రాబోతోందో సుస్పష్టం. చంద్రబాబు గద్దె దిగి బయటకు వెళ్లిపోయే దారిలో ఉన్నారు. ఆయన రాజకీయ జీవితం ముగింపునకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆయనకు దీర్ఘకాలిక సెలవు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకునేలా చూడాలనుకుంటున్నాం. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం ఒక అభ్యర్థన చేయాలని భావిస్తున్నాం. అది ఎప్పుడు చేయాలనేది మా ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు’’ అని తెలిపారు. అంటే ఏపీ వాళ్లను ద్రోహులని, కన్నింగ్‌లని పలుమార్లు బహిరంగంగానే అన్న టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెబితే రాష్ట్ర ప్రజలు వింటారని వాళ్లు భావిస్తున్నట్లా..? అసలు ఇది ఎలా సాధ్యమవుతుందని గులాబీ బాస్ అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి..!