అడ్డంగా బుక్కయిపోయిన కేటీఆర్ !!

February 19, 2020

గులాబీ బాస్ కేసీఆర్ మాటల్లో ఒక రిథమ్ ఉంటుంది. మనసును హత్తుకునేలా మాట్లాడటం తెలుసు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా భావోద్వేగాల్ని రగల్చాలో.. ఎక్కడ ప్రత్యర్థుల్ని పూచిక పుల్లలా తీసివేయాలో కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే ఆయన ఒకసారి మాట్లాడిన తర్వాత.. ప్రత్యర్థులు మాటల కోసం వెతుక్కునే పరిస్థితి. కేటీఆర్ తండ్రి మాటల్ని కొడుకు కాపీ కొట్టారు. అందులో తప్పేం లేదు. కానీ... కేసీఆర్ మాటకు వ్యూహం ఉంటుంది. అది కేటీ రామారావు మాటల్లో లేకపోవడం వల్ల నిన్న ఘోర తప్పిదం జరిగింది. నాన్న మార్క్ డైలాగుల్ని కొడుకు కేటీఆర్ అడ్డదిడ్డంగా వాడేసి అభాసుపాలు అయ్యారు.
తాజాగా నిర్వహించిన ఒక సభలో బీజేపీ అధినాయకత్వపు దూత జేపీ నడ్డాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు కేటీఆర్. ఎవరైనా తనను తీవ్రస్థాయిలో విమర్శించినప్పుడు.. వారి స్థాయిని తగ్గించేలా.. వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా చాలా క్యాజువల్ గా వారిని తీసిపారేసినట్లుగా మాట్లాడే కేసీఆర్ లా కేటీఆర్ కూడా ప్రవర్తించాడు. కేటీఆర్ ఏమన్నాడు అంటే...
నిన్నో పెద్దాయన వచ్చారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు. జేపీ నడ్డానట. ఆయన పేరును నేనైతే ఇంతవరకూ వినలేదు. కానీ.. ఆయన మాటలు విన్నాక మొత్తం ఒకటైతే అర్థమైంది. ఆయన పేరు జేపీ నడ్డా అని కాదు. పచ్చి అబద్ధాల అడ్డాగా పెట్టుకోవాలి. ఒక్క మాట కూడా నిజం లేదంటూ ఫైర్ అయ్యారు.
జేపీ నడ్డా లాంటి నేత పేరును తాను ఇప్పటివరకూ వినలేదన్న మాట ద్వారా కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారు. ఐదేళ్లు రాష్ట్రమంత్రిగా పనిచేసిన కేటీఆర్ కి, అదే సమయంలో కేంద్రంలో పనిచేసిన మంత్రి తెలియదంటే... అది తెలివితక్కువ తనమే కాదు, తప్పు కూడా! ఎవరూ నమ్మరు కూడా. పైగా ఆయన కేవలం సాధారణ మంత్రి మాత్రమే కాదు కేటీఆర్ తక్కువ చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రధాని మోడీషాలకు నడ్డా అత్యంత సన్నిహితుడు. పైగా టీఆర్ఎస్ లో కేటీఆర్ పోస్టు ఏందో... బీజేపీకి జాతీయ స్థాయిలో నడ్డా పోస్టు కూడా అదే. అది కేటీఆర్ కు తెలియదు అంటే ఎవరైనా నమ్మగలరా? నడ్డా విషయంలో ఇలాంటి విరుపు మాటలు అతకవు సరికదా.. ఇలాంటి వ్యాఖ్యలు బలుపుగా మారటం ఖాయం.
అంత పెద్ద మనిషి పేరు వినలేదంట.. అధికారం బాగా తలకెక్కినట్లుందే అన్న నెగిటివ్ వ్యాఖ్యలకు ఆస్కారం వచ్చింది. కొసమెరుపు ఏంటంటే.. తానెప్పుడూ పేరు కూడా వినలేదు అంటున్న జేపీ నడ్డాను స్వయంగా కేటీఆర్ కలిసి కొన్న వినతులు అందించారు. అది మీడియాలో వచ్చింది. తను ట్వీట్ కూడా చేశాడు. కావాలంటే... అతను తన టైం లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ తను మతిమరుపు ఉండి మరిచిపోయి ఉంటే... చెల్లిని అడగొచ్చు.  తన చెల్లి కల్వకంట్ల కవిత టీఆర్ఎస్ ఎంపీలతో పాటు వెళ్లి కలిసింది. ఇదిగో కింద వీడియో సాక్ష్యం. మరి ఇపుడు కేటీఆర్ జెపి నడ్డా ఎవరో తెలియదని చెబుతారా?  అలాగే కేటీఆర్ ట్వీట్ కూడా కింద స్క్రీన్ షాట్ పెట్టాం.