ఈ మాట‌లు నాన్న గారికి తేలిస్తే ఎలా ఉంటుంది కేటీఆర్?

June 05, 2020

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ గురించి అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. కరోనా వైరస్‌ నివారణకు స్వీయ నియంత్రణే మందు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాబోయే రెండు వారాలు ఎంతో కీలకమ‌ని, కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని మంత్రి కేటీఆర్‌ ప్రజలను కోరారు.
అగ్రరాజ్యమైన అమెరికా కూడా కరోనా వైరస్ ను తట్టుకోలేకపోయిందని.. అక్క‌డ‌ శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మాత్రం ప‌రిస్థితి అదుపులో ఉందని చెప్పారు.  మరో రెండు వారాలు కూడా ప్రజలు ఇలాగే సహకరించి త్వరలో తెలంగాణను కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించుకుందామ‌ని మంత్రి అన్నారు. క‌రోనా ప్ర‌బ‌లితే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. జిల్లా యంత్రాంగం కరోనా సోకకుండా అప్రత్తమైంద‌ని, జిల్లాలో ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైందని మంత్రి చెప్పారు. మర్కజ్‌ ఘటన లేకపోతే జిల్లాల్లో ఆ ఒక్క కేసు కూడా ఉండేది కాదన్నారు. మళ్లీ కొత్త కేసు నమోదు కాకుండా అంద‌రూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.
కాగా, ఢిల్లీ నిజాముద్దీన్‌లో జ‌రిగిన మ‌ర్క‌జ్ మ‌త ప్రార్థ‌న‌ల్లో పాల్గొన‌డం వ‌ల్ల క‌రోనా పాజిటివ్‌గా తేలిన వారి విష‌యంలో ఇప్ప‌టికీ తెలంగాణ ప్ర‌భుత్వం గ‌ట్టిగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఎంఐఎంతో పొత్తు కొన‌సాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ మ‌జ్లిస్ నేత‌ల ఒత్తిడికి త‌లొగ్గి ఇలా మెత‌క‌గా ఉంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతున్న త‌రునంలో కేటీఆర్ వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేపుతున్నాయి.