కేటీఆర్... అందరి మనసు దోచుకున్నాడు

July 06, 2020

విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ పాకిస్తానీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దుకు.. సుష్మ మరణానికి ముడిపెడుతూ ఆ పాకిస్తానీ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు.
సోమవారం రాత్రి సుష్మ స్వరాజ్ కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందడంతో కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. గతంలో ఆమెను కలసినప్పటి ఫొటోలను ఆయన అప్‌లోడ్ చేశారు. అయితే.. కేటీఆర్ చేసిన ఈ పోస్టుపై ఓ పాకిస్తానీ స్పందించాడు. కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే ఆమె చనిపోయారని... ఆమె కోసం నరకం ఎదురు చూస్తోందని ట్వీట్ చేశాడు. దీంతో కేటీఆర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతే స్థాయిలో రిప్లయ్ ఇచ్చారు.
సుష్మాస్వరాజ్ మరణంపై మీరు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ కేటీఆర్ ఆగ్రహించారు. మీ వక్ర బుద్ధికి ఈ కామెంట్ అద్దం పడుతోందని మండిపడ్డారు. మీ ప్రొఫైల్ పిక్ చూస్తుంటే... మీరు పాకిస్థాన్ కు చెందినవారిలా ఉన్నారని... జీవితాంతం ప్రజాసేవలో ఉన్న సుష్మాస్వరాజ్ లాంటి వారిని గౌరవించడానికి మీరు కొంత ధైర్యాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు.
కాగా తెలంగాణ విభజన సమయంలో సుష్మ లోక్ సభలో పోషించిన పాత్రను తెలంగాణ ప్రజలు, నేతలు గుర్తుంచుకుంటారు. ఈ కారణం వల్ల కూడా కేటీఆర్ వంటి నేతలు ఆమెను ఎంతగానో గౌరవిస్తుంటారు. ముఖ్యంగా, 2014, ఫిబ్రవరి 18వ తేదీన లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై అత్యంత కీలక చర్చ జరుగుతున్న సమయంలో అప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి, బీజేపీ సీనియర్ నేతలను ఒప్పించిన సుష్మా స్వరాజ్ భావోద్వేగ ప్రసంగాన్ని చేశారు. 'ఆరు దశాబ్దాలుగా పడుతున్న ప్రసవ వేదనను తీర్చే సమయం వచ్చేసింది. ఎన్నో త్యాగాలు, మరెన్నో బలిదానాల మధ్య, పండంటి తెలంగాణ బిడ్డ జన్మించనుంది. మేమిచ్చిన వాగ్దానం మేరకు మా మాటను నిలబెట్టుకున్నాం. నేడు జన్మించనున్న తెలంగాణ బిడ్డ ఎదిగేందుకు పాటుపడతాం. తెలంగాణ ప్రజలారా, ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి' అంటూ సుష్మా చేసిన ట్వీట్ వైరల్ అయింది.