అతని మరణంతో... వేదనలో కేటీఆర్

August 03, 2020

దిగ్గజ క్రీడాకారుడిగా సుపరిచితుడు.. తన క్రీడావిన్యాసాలతో ప్రపంచ స్థాయిలో పెద్ద ఎత్తున అభిమానుల్ని సొంతం చేసుకున్న బ్యాసెట్ బాల్ క్రీడాకారుడు కోబ్ బ్రయంట్ మరణవార్త అందరిని ఎంతలా షాకింగ్ కు గురి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ క్రీడాకారుడి మరణవార్త తెలిసిన వెంటనే తాను షాక్ కు గురైనట్లు కేటీఆర్ వెల్లడించాడు. కోబ్ తన అభిమాన ఆటగాడన్న విషయాన్ని వెల్లడించారు.
హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన కోబ్ మరణం క్రీడా ప్రపంచాన్ని కుదిపేయటమే కాదు.. క్రీడాభిమానులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ప్రమాదంలో ఆయనతో పాటు.. ఆయన కుమార్తె కూడా మరణించిన విషయం తనను కలిచివేసినట్లు కేటీఆర్ చెప్పారు. తనకీ విషయం తెలిసినంతనే షాక్ కు గురయ్యానని ట్విట్టర్ లో తన ట్వీట్ తో వెల్లడించారు.
బాస్కెట్ బాల్ క్రీడాకారుడిగా కోబ్ గొప్పతనాన్ని తెలిపే ఒక ఫోటోను ఈ సందర్భంగా కేటీఆర్ పోస్టు చేశారు. ఐదుసార్లు ఎన్ బిఏ ఛాంపియన్.. రెండుసార్లు ఎన్ బీఏ ఫైనల్స్.. అత్యుత్తమ ప్లేర్ అవార్డును సొంతం చేసుకోవటమే కాదు.. నాలుగుసార్లు అత్యంత విలువైన క్రీడాకారుడిగా అతనికి గుర్తింపు ఉంది. అతడి ఆత్మకు శాంతి కలగాలని తాను ప్రార్థిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.