కేటీఆర్ ఫొటో వైరల్

July 19, 2019

రాజ‌కీయ నాయ‌కుడంటే.. గంభీరంగా ఉండ‌టం.. పెద్ద పెద్ద మీసాలు. కంచుమ‌ని మోగే కంఠం. మ‌ల్లెపువ్వులాంటి తెల్ల దుస్తుల‌తో త‌ప్పించి రంగు బ‌ట్టల్లో క‌నిపించ‌ని తీరు మ‌న రాజ‌కీయ నాయ‌కుల సొంతం. అందుకు భిన్నంగా చాలా క్యాజువ‌ల్ గా.. మ‌న ప‌క్కింటి వ్య‌క్తి మాదిరి కూల్ గా క‌నిపించ‌టం మ‌న నేత‌ల్లో అస్స‌లు క‌నిపించ‌ని కోణం.
అయితే.. రాజ‌కీయ నేత‌.. అందునా ప‌వ‌ర్ స్టేష‌న్ లాంటి నేత ఇలానే ఉండాల‌న్న దానికి భిన్నంగా..కొంగొత్త‌గా ఉండ‌టం తెలంగాణ అధికార పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కే చెల్లుతుందేమో. రౌండ్ నెక్ టీ ష‌ర్ట్ వేసుకొని.. చిన్న షాట్ (పొట్టి లాగు) వేసుకొని రిలాక్స్ అయితే అవ్వొచ్చు. కానీ.. అలాంటి ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌టానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు. 
కేటీఆర్ మాత్రం అలాంటి రూల్స్ ను బ్రేక్ చేసేస్తున్నారు. తాజాగా ఆయ‌న బాంబే ఐస్ (కండ్ల క‌ల‌క‌)తో ఇబ్బంది ప‌డుతున్నారు. క‌ళ్లు ఎర్ర‌గా మార‌టం.. మంట‌.. జిల‌తో పాటు.. అదే ప‌నిగా కండ్ల నుంచి నీరు కార‌టం ఈ స‌మ‌స్య ల‌క్ష‌ణం. ఇలాంటి వేళ‌.. కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటారు. ఇలాంటి ప‌రిస్థితి ఎవ‌రైనా ప్ర‌ముఖ నేత‌కు ఎదురైతే.. గుట్టుగా ఉంచేస్తారు. ఒక‌వేళ త‌ప్ప‌ద‌నుకుంటే.. చిన్న ప్రెస్ రిలీజ్ చేస్తారు.
కానీ.. అందుకు భిన్నంగా తానున్న తాజా స్టేట‌స్ ను ట్వీట్ ద్వారా పేర్కొంటూ రోటీన్ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే ద‌మ్ము.. ధైర్యం కేటీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మేమో? స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ఇంత ట్రెండీ గా ఉండే ముఖ్య‌నేత‌గా కేటీఆర్ మాత్ర‌మే క‌నిపిస్తారేమో? 42 ఏళ్ల ఈ రాజ‌కీయ ప్ర‌ముఖుడు.. పొట్టి లాగుతో ఫోటో దిగి షేర్ చేయ‌టం మాత్రం క‌చ్ఛితంగా ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా చెప్ప‌క‌త‌ప్ప‌దు.