బెంగళూరు... కేటీఆర్ కు కునుకు పట్టనీయట్లేదుగా !!

May 22, 2020

నిజమేనబ్బా... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును బెంగళూరు నగరం అస్సలు నిద్రపోనివ్వడం లేదనే చెప్పాలి. ఒకవేళ ఆయనకు నిద్రపట్టినా... కలలో కూడా బెంగళూరే కనిపిస్తున్న పరిస్థితి. నిజమా? అంటే... కేటీఆర్ నోట వస్తున్న మాటలు చూస్తే... నిజమేనని ఒప్పేసుకోక తప్పదు మరి. హైదరాబాద్ అభివృద్దిపై ఎప్పుడు మాట్లాడినా... కేసీఆర్ నోట బెంగళూరు ప్రస్తావన లేకుండా ప్రసంగం పూర్తి కావడం లేదు. బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని, ఇదిగో ఇదే సాక్ష్యమంటూ కేటీఆర్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకున్నారు. ప్రత్యేకించి ఐటీ రంగం అభివృద్ధి విషయానికి వస్తే.. కేటీఆర్ నోట వెంట బెంగళూరు ప్రస్తావన లెక్కలేనన్ని సార్లు వినిపిస్తూనే ఉంటుంది.

తాజాగా మరోమారు తనలోని ఈ తరహా వైఖరిని కేటీఆర్ చాటుకున్నారు. ఐటీ హబ్‌ బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్ దూసుకెళ్తుందని కేటీఆర్ తాజాగా కామెంట్ చేశారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌తోపాటు ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, గేమింగ్, ఆఫీసు స్పేస్ విభాగాల్లో బెంగళూరుతో హైదరాబాద్ సమానంగా నిలుస్తోందని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో ఆయా విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కూడా ఆయన చెప్పారు. రాయదుర్గంలో ఇంటెల్ ఇండియా డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. హార్డ్‌వేర్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం ఉద్దేశించిన టీ వర్స్క్ ఏప్రిల్‌లో ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు.

వచ్చే నాలుగేళ్లలో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు 3 లక్షల మంది ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ అండ్ మానుఫాక్చరింగ్ విభాగంలో కొలువులు లభిస్తాయని చెప్పారు. బెంగళూరు తర్వాత నూతన ఆర్ అండ్ డిజైన్ సెంటర్‌ హైదరాబాద్‌లో ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్ నగరానికి మరింత మంచి పేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు దేశం నుంచి ఎక్సెల్ స్కేల్ కంప్యూటర్ అభివృద్ధి చేయడం మనందరికీ గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ విభాగంలో దేశంలోనే హైదరాబాద్ ముందువరసలో నిలుస్తోందని ఆయన తెలిపారు. మొత్తంగా బెంగళూరు ప్రస్తావన లేనిదే కేటీఆర్ కు అస్సలు పాలుపోవడం లేదన్న మాట.