వార్నింగ్ ఇచ్చేసిన కేటీఆర్! రాజకీయం బాగానే వంటపట్టినట్టుందే..!

July 21, 2019

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా బాగానే సాగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి విమర్శకుల నోరుమూయించిన గులాబీ దళం.. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే జోష్ లో పాల్గొంది. ఇక ఆ వెంటనే స్థానిక ఎన్నికల సమరానికి రెడీ అయింది. అయితే ఇలా వరుస ఎన్నికల్లో ఫుల్ జోష్ లో పాల్గొనడం వెనుక టీఆర్ఎస్ అధికార ప్రతినిధి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్కెచ్చులే ప్రధానంగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

టెక్నాలజీ బాగా పెరిగిన ఈ రోజుల్లో ఒక ఎన్నికను ఎదుర్కోవటం అంటేనే ఓ యుద్ధంతో సమానం. అలాంటిది వరుసపెట్టి ఎన్నికలు ఎదుర్కోవడమంటే తేలికైన విషయం కాదు. కానీ ఈ విషయంలో టీఆరెస్ దూకుడుగా ఉంది. దీంతో ఈ దూకుడుకు కారణమేంటనే కోణంలో ఆరాదీయగా ఇదంతా కేటీఆర్ వ్యూహమే అని తెలుస్తోంది. కేటీఆర్ మార్గదర్శకాలతోనే టీఆర్ఎస్ దూకుడుగా ఎన్నికల్లో పాల్గొంటోందని అంటున్నారు. ఎన్నికల్ని సమరోత్సాహంతో ఎదుర్కోవటం ఒక ఎత్తు అయితే.. గెలుపును తమ ఖాతాలో వేసుకుంటూ.. ఓటమిని తమకు సంబంధం లేదన్నట్లుగా చెప్పి ఒప్పించటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో? అనిపిస్తోంది టీఆర్ఎస్ జోరు చూస్తుంటే. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బను సింఫుల్ గా తప్పించిన కేసీఆర్ తీరు చూస్తే.. ఆయన సమర్థతకు ముచ్చట పడాల్సిందే మరి.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు రాకముందే స్థానిక ఎన్నికల రణానికి సిద్ధమైన కేసీఆర్ సర్కారు.. ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా తమ విజయాల్ని సంపూర్ణం చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ ఎన్నికల బాధ్యతను నెత్తికి ఎత్తుకున్న కేటీఆర్.. తన టార్గెట్ చెప్పేశారు. మొత్తం 32 జెడ్పీ పీఠాల్ని సొంతం చేసుకోవటంతో పాటు 530కు పైగా మండల పరిషత్ లను సొంతం చేసుకోనున్నట్లు ఆయన చెబుతుండటం ఆయనలోని ధైర్యానికి నిదర్శనం. పంచాయితీరాజ్ వ్యవస్థకు ప్రాణాధారమైన జెడ్పీ స్థానాలు, మండల పరిషత్ ఎన్నికల్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. ఇప్పటికే ఎదుర్కొన్న ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకున్నారో అంతే సీరియస్ గా తీసుకోవాలే కానీ నిర్లక్ష్యం అస్సలు పనికి రాదని ఆయన పార్టీ వర్గాలకు సూచనలు జారే చేశారట. పార్టీ నేతలకు, కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో గెలుపు టార్గెట్ ఫిక్స్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చేశారట కేటీఆర్. అంటే ఆయన తీరు చూస్తే ఎన్నికల రాజకీయం బాగానే వంట పట్టిందని అర్థమవుతోంది కదూ! తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ అడుగులు బాగానే పడుతున్నాయే!