కేటీఆర్... సినిమాల్లోకి వస్తే

July 08, 2020

మీడియాకు.. సోషల్ మీడియాకు తేడా ఏమిటో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం తమకొచ్చే సందేహాల్ని తీర్చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా నేతలు సైతం సమయానికి తగ్గట్లు సోషల్ మీడియా వేదిక మీదుగా తాము ఇవ్వాల్సిన సందేశాన్ని ఇచ్చేస్తున్నారు. నెటిజన్లతో నేరుగా మాట్లాడేయటం ఒక ఎత్తు అయితే.. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? తమ నుంచి ఏం కోరుకుంటున్నారు? లాంటి అంశాల మీద అవగాహన పెంచుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విషయానికే వస్తే.. సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ గా ఉండటమే కాదు.. తరచూ నెటిజన్లకు అందుబాటులోకి వస్తారు. తాజాగా ఆస్క్ కేటీఆర్ హ్యాష్ ట్యాగ్ తో పలువురు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు సీరియస్ అంశాలకు కేటీఆర్ బదులివ్వగా.. కొన్ని ట్రికీగా ఉండే ప్రశ్నలు ఆయనకు ఎదురయ్యాయి. అయితే.. అన్ని ప్రశ్నలకు తనదైన రీతిలో బదులిచ్చిన ఆయన నూటికి నూరు మార్కులు కొట్టేశారు.
ఈ కార్యక్రమంలో ఊహించని రీతిలో ఒక నెటిజన్ నుంచి వచ్చిన ప్రశ్న కాస్త చిత్రంగా ఉందని చెప్పాలి. ఇలాంటి ప్రశ్న ఎదురైతే కేటీఆర్ ఎలా బదులిస్తారో? అన్న సందేహానికి గురయ్యే వ్యవధిలోనే ఆయన సమాధానమిచ్చిన తీరు చూస్తే కేటీఆర్ సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేం. ఇంతకీ ఆ ప్రశ్నేమిటంటారా? అక్కడికే వస్తున్నాం.  రాజేశ్ అనే నెటిజన్ ఒకరు మీరు సినిమాల్లో నటిస్తారా? మీరు నటిస్తే మీ నుంచి ఒక కొత్త తరహా సామాజిక సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది కదా? బ్రదర్ అన్న ప్రశ్నను సంధించారు.
దీనికి రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్.. థ్యాంక్స్.. నాకు ఒక ఫుల్ టైం జాబ్ ఉందని బదులివ్వటం ద్వారా ప్రశ్నకు తగ్గట్లే ఆయన సమాధానం ఇచ్చారు. క్లిష్టమైన ప్రశ్నలకు సైతం త్రోటుపాటుకు గురి కాకుండా మంత్రి కేటీఆర్ ఇచ్చిన సమాధానాలు పలువురిని అకర్షిస్తున్నాయి.