టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ల కాళ్లు పట్టుకుంటున్నారా?

February 27, 2020

ఎమ్మెల్యే అంటే ఎంత పవరో.. అన్నది ఒకప్పుడు మాటగా మారిందంటూ రాజకీయ వర్గాల్లో తరచూ చర్చకు వస్తుంటుంది. గతం లాంటి పరిస్థితి ఇప్పుడు లేదని.. ఒకప్పుడు ఎమ్మెల్యేకు ఉండే మర్యాద.. గౌరవం ఇప్పుడు అంత లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే.. ఒక స్థానిక నేత కడుపులో తల పెట్టటమే కాదు.. కాళ్లు పట్టుకునే పరిస్థితి ఉంటుందా? అంటే.. ఉండదని చెప్పాలి. కానీ.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో అలాంటి పరిస్థితి ఉందన్న మాట మంత్రి కేటీఆర్ నోటి నుంచే రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలోని మున్సిపాల్టీలు.. కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొందన్న మాట వినిపిస్తోంది. మున్సిపోల్స్ లో తాము వంద శాతం మంచి ఫలితాలు సాధిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్. ఇదంతా బాగానే ఉన్నా.. ఆయన నోటి నుంచి ఒక మాట ఆసక్తికరంగానే కాదు.. ఎమ్మెల్యే పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? అన్న డౌట్ వచ్చేలా చేస్తోంది.
మున్సిపోల్స్ కు టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగేందుకు టికెట్లను ఆశిస్తున్నవారి సంఖ్య భారీగా ఉందని.. దీంతో ఈ పోటీ తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యేలు.. టికెట్లను ఆశిస్తున్న నేతల కడుపులో తల పెట్టటమే కాదు.. కాళ్లు కూడా పట్టుకుంటున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. టికెట్ల కోసం పార్టీలో ఆశావాహుల పోటీ ఎక్కువగా ఉన్నప్పటికి.. వారిని కంట్రోల్ చేయటం తమకు తెలీదా? అన్న మాట అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యేల నోట వినిపిస్తోంది.
ఎంత పోటీ ఎక్కువగా ఉంటే మాత్రం.. తమను కించపరిచేలా మంత్రి కేటీఆర్ మాటలు ఉన్నట్లుగా పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అయితే.. తమ పేరు బయటకు రాయొద్దన్న మాట వినిపిస్తోంది. అయితే.. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్ని అధికార పార్టీ ఎమ్మెల్యేల స్థాయిని తగ్గించినట్లు ఉందన్న మాటలో నిజం లేదని.. మాట వరసకు మంత్రి అన్నట్లుగా మరికొందరు ఎమ్మెల్యేలు సర్ది చెప్పటం విశేషం. ఏమైనా.. సొంత ఎమ్మెల్యేల్ని తగ్గించేలా కేటీఆర్ వ్యాఱ్యలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.