టీఆరెస్‌పై ఆ ఎఫెక్ట్ పడకుండా కేటీఆర్ కేర్

August 08, 2020

కరోనా వైరస్ ఒక్క చైనానే కాదు ప్రపంచం మొత్తాన్నీ భయపెడుతోంది. ఇది కేవలం ఆరోగ్య విపత్తుగానే కాకుండా ఆర్థిక విపత్తుగానూ మారిపోయింది. ఒక్క చైనాలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ఇతర దేశాలకు వ్యాపించిన ఈ వైరస్‌కు ఇప్పటికే వేలాది మంది బలైపోయారు. ప్రపంచ ఆర్థిక మార్కెట్లన్నీ కొద్దిరోజులుగా కుదేలవుతున్నాయి. వరల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా గుర్తింపు ఉన్న చైనా కరోనా దెబ్బకు కుదేలవడంతో ఆ దేశంతో ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం చేసే అనేక దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. ఈ కరోనా దెబ్బ రాజకీయాలపైనా పడే ప్రమాదం ఉండడంతో కొన్ని పార్టీలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో పాలక పార్టీ టీఆరెస్ కూడా కరోనా ఎఫెక్ట్ తమపై లేకుండా జాగ్రత్త పడినట్లుగా కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్లో చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. చికెన్ వల్ల కరోనా వైరస్ వచ్చే ప్రమాదముందన్న ప్రచారం సాగుతుండడంతో చికెన్ అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ఆ క్రమంలోనే ఈ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ చికెన్‌పై దుష్ప్రచారాలు, అపోహలు నమ్మొద్దని అన్నారు. పౌల్ట్రీ ఇండస్ట్రీని దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాలు వద్దని సూచించారు.
మంత్రి కేటీఆర్ చెప్పింది నిజమే.. ఇప్పటివరకు చికెన్ వల్ల కరోనా వస్తుందని ఎక్కడా రుజువు కాలేదు. కాబట్టి అనవసర అపోహలు అవసరం లేదు. తెలంగాణకు చెందిన ముఖ్య నాయకుడు ఇలా దీనిపై తొందరగా స్పందించడం మంచిదే అయినప్పటికీ దీని వెనుక కారణాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ భారీగానే ఉంది. అందులోనూ టీఆరెస్ కీలక నేతల్లో చాలామంది ఈ వ్యాపారంలోనే ఉన్నారు. పార్టీకి ఆర్థికంగా అండగా ఉండేవాల్లలో అనేకమందికి పౌల్ట్రీ వ్యాపారమే ప్రధాన ఆర్థిక వనరు. ఆ కారణం వల్లే కేటీఆర్ ఇంతలా స్పందించారని వినిపిస్తోంది.
ఈ దుష్ప్రచారం పెరిగి పౌల్ట్రీ ఇండస్ట్రీ దెబ్బతింటే నాయకులు ఆర్థికంగా నష్టపోతారని.. తత్ఫలితంగా పార్టీకి నష్టం కలుగుతుందని టీఆరెస్ పెద్దలు అంచనా వేసినట్లు తెలుస్తోంది.  ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, ఈటెల రాజేందర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నిరంజన్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈటెల, రంజిత్ రెడ్డి వంటివారు పౌల్ట్రీ వ్యాపారంలో దిగ్గజాలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.