కేటీఆర్ సైలెన్స్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

August 12, 2020
CTYPE html>
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వైఖ‌రిపై ఇప్పుడు తెలంగాణ‌లో ప్రతిప‌క్షాలు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నాయి.
రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన సచివాల‌యం కూల్చివేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌త కొద్దిరోజులుగా ప‌రిపాల‌న సంబంధ వ్య‌వ‌హారాల‌కు, మీడియాకు దూరంగా ఉంటున్న తీరుతో విప‌క్షాలు ఆయ‌న్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేసిన స‌మ‌యంలో...వివిధ అంశాల‌పై స్పందిస్తున్న కేటీఆర్ ఈ రెండు ముఖ్య‌మైన అంశాల‌పై మాత్రం మౌనం పాటిస్తుండ‌టంతో....ఇది వ్యూహాత్మ‌క మౌన‌మా లేక‌పోతే ‌తండ్రి నుంచి వ‌చ్చిన ఆదేశాల ఫ‌లితమా అని చ‌ర్చించుకుంటున్నారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి జాడ ఎక్క‌డ అని రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలు ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలి‌సిందే.
క‌రోనా క‌ట్ట‌డి స‌మ‌యంలో ఆయ‌న జాడ ఏద‌ని ప్ర‌శ్నిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లోని ప్ర‌స్తుత స‌చివాల‌యాన్ని కూల్చివేయ‌డంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.
టీఆర్ఎస్ పార్టీని, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఇరుకున ప‌డేసేలా కామెంట్లు చేస్తున్నాయి.
దీనికి ప‌లువురు మంత్రులు, నేత‌లు క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడటం తప్ప కాంగ్రెస్, బీజేపీలకు ఏం చేతకాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విప‌క్షాల‌పై మండిప‌డ్డారు.
ఆ పార్టీల నేత‌ల‌ తీరు చూస్తుంటే తెలంగాణ పై విషాన్నిచిమ్మడమే వారి పని అయినట్టు ఉందని, సొంత గడ్డకు ద్రోహం చేయడమే వారి విధానమ‌ని విమ‌ర్శించారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిపై ప్ర‌తిప‌క్షాలు చేసే కామెంట్‌ల‌పై మండిప‌డుతూ…కేసీఆర్‌ గట్టిగానే ఉన్నారని ప్ర‌క‌టించిన మంత్రి ఆయనది బలమైన గుండె కాయ అని విశ్లేషించారు.
సీఎం ఎంత గట్టి గా ఉన్నారో మాకు తెలుసు. ఎవ్వరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని వెల్లడించారు.
ఆయ‌న వ్యవసాయ క్షేత్రం అమరావతిలో ఉందా? ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడుంటే ఏమిటీ? ఏ పథకమైనా ఆగిందా?ఆసరా పెన్షన్లు, రైతు బంధు ఆగిందా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

కాగా, గ‌త రెండురోజులుగా వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో పాటుగా మీడియా స‌మావేశాల్లోనూ పాల్గొంటున్న మంత్రి కేటీఆర్‌...ఈ రెండు అంశాల‌పై మాత్రం స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
తాజాగా క‌రీంన‌గ‌ర్‌లో జ‌రిగిన స‌మావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎవరూ కూడా నాకు కరోనా రాదు అనే అపోహతో ఉండొద్దని కోరారు.
``నేను ఓ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు కలిసి హాజరయినపుడు మాస్కు పెట్టుకోమంటే నాకు కరోనా రాదు అన్నారు. కానీ మరుసటి రోజే కరోనా వచ్చింది” అని కేటీఆర్ చెప్పారు.
పెద్ద పెద్ద దేశాలే కరోనా కేసులు పెరగడం వల్ల కట్టడి చేయలేక చేతులు ఎత్తేశాయన్నారు. కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెయిల్ అయ్యార‌ని ప్ర‌తిప‌క్షాలు రాజకీయ విమర్శలు చేయడం దుర్మార్గపు చర్య అని కేటీఆర్ అన్నారు.
కానీ ఈ స‌మావేశంలో ఇటు స‌చివాల‌యం గురించి కానీ అటు త‌న తండ్రి మౌనం గురించి కానీ కేటీఆర్ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.