జనాల మాట వినమని జగన్ కి కేటీఆర్ సలహా? మరి కేసీఆర్ ఏం చెప్పారో?

February 18, 2020

తెలంగాణ రాష్ట్ర మంత్రి.. రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించే కేటీఆర్ నోటి వెంట ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. మీడియా మిత్రులతో సరదాగా చిట్ చాట్ చేసేందుకు రమ్మని పిలిచిన తర్వాత.. ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా భేటీ అంటే.. చానళ్లు గొట్టాలు పట్టేసుకొని లైవ్ ఇచ్చేందుకు వీలుగా ఉంటుంది. కానీ.. చిట్ చాట్ లో మాత్రం నో కెమెరాలు.. నో మైకులన్న మాట.
కేటీఆర్ తో ముచ్చట్లు అన్నంతనే అవునన్నా.. కాదన్నా ఏపీకి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చేస్తుంటాయి. తాజా చిట్ చాట్ లోనూ అలాంటి పరిస్థితే. ఏపీ రాజధాని అమరావతిని అక్కడే ఉంచాలంటూ కొన్నిరోజులుగా సాగుతున్న వ్యతిరేకత.. అక్కడ జరుగుతున్న ఆందోళనలు.. నిరసనల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా కేటీఆర్ నోటి వెంట ఆణిముత్యాల్లాంటి మాటలు వచ్చాయి.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పది జిల్లాలను 33 జిల్లాలుగా విభజన చేశామని.. కొత్త జిల్లాల ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణలో రవ్వంత వ్యతిరేకత కూడా రాలేదన్నారు. కానీ.. ఏపీ రాజధాని విషయంలో వ్యతిరేకత వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయం మీద కాస్త ఆలోచించాలన్న ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి. మూడు రాజధానులు ఉండొచ్చంటూ ఏపీ సీఎం జగన్ నోటి వెంట ప్రకటన వచ్చిన తర్వాత నుంచి విమర్శలు.. ఆందోళనలు జరుగుతున్నాయన్నారు.
తెలంగాణలో కొత్త జిల్లాలు.. మండలాలు ఏర్పడ్డాయని.. ఎక్కడా చిన్న సంఘటన కూడా జరగకుండా కేసీఆర్ సక్సెస్ ఫుల్ గా పాలిస్తున్నారన్న కేటీఆర్ మాటలపై విస్మయం వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాలు తొలుత 31 మాత్రమే అనుకోవటం.. తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు రాజుకున్న తర్వాత 33కు పెంచటాన్ని కేటీఆర్ మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. అవే కాదు.. జిల్లాల ఏర్పాటు సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకోవటం.. ఆ సందర్భంగా వాటిని ఎలా సర్దుబుచ్చిన విషయాన్ని కేటీఆర్ మర్చిపోయినట్లున్నారన్న వాదన వినిపిస్తోంది.
మొన్ననే తెలంగాణ ముఖ్యమంత్ర కేసీఆర్.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కావటం.. ఒకరితో ఒకరు ఏకంగా ఆరు గంటల పాటు ఏకాంతభేటీ జరిగిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆ భేటీలో ఏపీలో ఏర్పాటు చేస్తున్న మూడు రాజధానులు సరైన నిర్ణయమని సీఎం కేసీఆర్ నోటి నుంచి మాట వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. మరి.. తండ్రి మెచ్చిన నిర్ణయాన్ని కొడుకైన కేటీఆర్ వ్యాఖ్యలు చేయటంలో మర్మమేమిటి? అన్నది క్వశ్చన్ గా మారింది. ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించుకోవాలని చెప్పే కేటీఆర్.. అదే అంశం మీద జగన్ తో భేటీ సందర్భంగా తన తండ్రి నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చెబితే బాగుండన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ విషయాల్ని కేటీఆర్ రివీల్ చేస్తారా?