యువరాజకు పట్టాభిషేకం..?

April 06, 2020

మార్పిడులకు ముందు ఈడీ దాడులు..?
భాజపాకు 'టచ్'లో కొందరు.?
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్?

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, అధికార మార్పిడి, వీళ్ళు, వాళ్ళు పార్టీని చీలుస్తారనే ఊహాగానాలకు తెరపడనుంది. ప్రస్థుత ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ చక్రం తిప్పనున్నట్లు తెలిసింది. ఆయన వారసుడిగా... తెలంగాణ రాష్ట్రానికి అతిత్వరలో మూడవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఐటీ-పరిశ్రమల శాఖామంత్రి కె.తారకరామారావు పదవిని అధిష్టించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

సీరియస్ గానే ఆలోచనలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవిని తనయుడు కేటీఆర్ కు కట్టబట్టాలని సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. యూపీలోని ములాయం-అఖిలేష్ ల లాగానే ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీకి గౌరవాధ్యక్షుడిగా ఉంటూ, ప్రభుత్వానికి పెద్దదిక్కుగా వ్యవహరించేందుకు కేసీఆర్ మెల్లగా సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇందుకేనా
ప్రస్తుత పరిస్థితులు కూడా తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా ఏమీలేవు. ‘‘కేసీఆర్ ఒంటెద్దుపోకడలు ఎవరికీ నచ్చడంలేదు. ఎవరైనా మంచి చెబితే, వారిని వెంటనే దూరం పెట్టేస్తున్నాడు. మంత్రులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలయినా, అధికారులైనా ఇదే పరిస్థితి. అందుకే ఎవరూ సాహసించడంలేదు’’ అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆయన చర్యలు పార్టీకి, ప్రభుత్వానికి చేటు తెస్తున్నాయని స్వయంగా కేటీఆర్ కూడా భావిస్తున్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక్కొక్కటిగా ఆయన చేస్తున్న తప్పులు కొండలా పేరుకుపోతున్నాయని తెరాస నేతలే వాపోతున్నారు. కొత్త సచివాలయ ప్రహసనం, కాళేశ్వరం వృధా పంపింగ్, చింతమడక ప్రజలకు తలా పదిలక్షలు, కృష్ణా-గోదావరి అనవసర అనుసంధానం లాంటి ఆలోచనలు ఎవరికీ మింగుడుపడడంలేదు.

ఇలా జరక్కుండా ఉంటే
‘హిందుగాళ్లు బొందుగాళ్లు’ అన్న కామెంటే బీజెపీకి నాలుగు సీట్లిచ్చిందని తెరాస క్యాడర్ బలంగా నమ్ముతోంది. దాంతో మోదీ-అమిత్షాల ఏకాగ్రత అంతా ఇప్పుడు తెలంగాణపై పెట్టారని, యూపీఏ అధికారంలోకి వస్తుందన్న మూఢనమ్మకంతో చేపట్టిన కొన్ని చర్యలు కూడా వారిని తెరాసకు దూరం చేసాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఆర్టీసీ చిచ్చు - చర్చలే పరిష్కారం
పులి మీద పుట్రలా ఇప్పుడు ఆర్టీసీ సమ్మె. ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు బలయ్యారు. రాష్ట్రమంతా రగిలిపోతోంది. ఎవరు, ఎప్పుడు ఎక్కడ సమ్మె చేసినా, కూర్చుని మాట్లాడుకుని ఎక్కడో ఒక దగ్గర రాజీకి వస్తారు. అన్ని డిమాండ్లు ఏ ప్రభుత్వం ఆమోదించదు. సంఘాలు కూడా ఆశించవు. విలీనం మినహా మిగతా వాటి గురించి ఆర్టీసీని స్వయంగా చర్చలకు పిలిస్తే బాగుండేది. సమస్య అక్కడే సగం పరిష్కారమయ్యేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. న్యాయస్థానం కూడా చర్చలు సాగించి.. సమ్మె పరిష్కరించాలని చెప్పింది. పార్టీలోని నిజమైన విధేయులు అందరూ అవేదన చెందుతున్నారు. బయటినుంచి వచ్చి, మంత్రి పదవులను అనుభవిస్తున్న వారు పేలుస్తున్న అవాకులు, చెవాకులే సమ్మె సమస్యను ఇంకా జఠిలం చేస్తున్నాయని ఒక నాయకుడు వాపోయాడు. మెల్లమెల్లగా ఉధృతమవుతున్న సమ్మె సకలజనుల సమ్మెగా మారనుందా అనే సందేహం అందరినీ పట్టిపీడిస్తోంది. అదే జరిగితే ఇక ఈ ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరని తెరాస వర్గాలు భయపడుతున్నాయి.

భాజాపా వైపు చూపు
సమ్మెకు సమయంలో అధికార తెరాస నేతలు కదలికలు ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తున్నాయి. తాము ఇతర పార్టీల్లోకి 'జంప్ చేయడానికి ఇదే సరైన సమయం' అని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తమ సన్నిహితుల వద్ద చర్చిస్తున్నట్లు సమాచారం.

'జంప్'కు ఇదో సాకు
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుతో గులాబీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను డిస్మిస్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇద్దరు కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ నిర్ణయాలను చాలామంది గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని తాము అనుకోలేదని సన్నిహితుల వద్ద చెప్పుకోవడం గమనార్హం.

కేంద్రం గుర్రుగా ఉందా?
మరోపక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఏమాత్రం బాగాలేవని ఢిల్లీలో టాక్. మొన్న కేసీఆర్ ప్రధానిని, హోంమంత్రిని కలిసినప్పడు కూడా వారు ముభావంగానే ఉన్నట్లు సమాచారం. ‘‘ఇక మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసి, మీరు గౌరవంగా తప్పుకోండ’’ని అమిత్ షా కేసీఆర్ కు చెప్పినట్లు బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వారు పూర్తిగా కేసీఆర్ మీదే దృష్టి సారించారనీ రాష్ట్ర బీజేపీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు.

అక్కడ.. ఇలాగే
కర్నాటకలో కేంద్రం ఇలా దాడులు సాగించిన తర్వాత అధికార మార్పిడి జరిగింది. అదే తరహాలో తెలంగాణలో దాని ఫలితమే మైహోమ్, మేఘాలపై ఐటీ దాడులని తెలుస్తోంది. ఇదిలా ఉండగా... భాజపాకు అనుకూలంగా ఉన్న జాతీయ ఛానళ్ళలో గత 48 గంటల నుంచి కొన్ని కథనాలను ఇవ్వడం జరుగుతోంది. ఈ సందర్భంగా అనేక సమీకరణల అనంతరం కేసీఆర్ హఠాత్తుగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన జాతీయ రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటూ... అక్కడ చక్రంతిప్పే అవకాశం ఉంది. అదే విధంగా సమస్యలు ఒకవైపు ఎదుర్కుంటున్న ఈ సందర్భాలు చక్కబడగానే... మన యువరాజు పట్టాభిషేకం జరగనుంది. ఏది ఏమైనా.. ఎవరికి ఇష్టం ఉన్ని.. లేకపోయినా.. కేసీఆర్ కుటుంబం నుంచి మరో నేత ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఇదీ ఆయన మాట.. ఆ మాటే శాసనం. అందులో తిరుగులేదు.