కేటీఆర్ కి గ్యారంటీ... బాబు కులానికీ ఛాన్స్ !

February 19, 2020

తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు కూడా మొదలైందని తెలుస్తోంది. ప్రస్తుతం 12 మంది మంత్రులున్న కేసీఆర్ కేబినెట్లో ఆరు ఖాళీలున్నాయి. ఈ ఆరు ఖాళీలను ఒకేసారి భర్తీ చేస్తారా... లేదంటే మరో విడత విస్తరణ ఉంటుందా అన్న విషయంలో స్పష్టత లేదు. అలాగే ప్రస్తుత కేబినెట్లో ఇద్దరిని మార్చనున్నట్లు కూడా బలంగా వినిపిస్తోంది.
మరోవైపు కేసీఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కేటీఆర్, హరీశ్ రావులను మళ్లీ కేబినెట్లోకి తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే ఇంతవరకు కేబినెట్లో మహిళలు లేరన్న ముద్రను తొలగించుకోవడానికి కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నారని.. సబితా ఇంద్రారెడ్డిని కేబినెట్లోకి తీసుకోనున్నారని టీఆరెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
‘కేటీఆర్‌ మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి’ అని ఆకాంక్షిస్తున్నా అంటూ టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ట్వీట్‌ చేయడం.. దానికి కేటీఆర్‌ స్పందిస్తూ ‘మీ అభిమానానికి ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇవ్వడం ప్రభుత్వంలో జరగనున్న మార్పులకు సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసద్‌కు సమాచారం లేకుండా అలాంటి ట్వీట్‌ చేయరని.. ముఖ్యమంత్రితో మాట్లాడిన సందర్భంలో వచ్చిన సంకేతాల మేరకే స్పందించారన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
నాలుగైదురోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విస్తరణ త్వరగా ఉండొచ్చనే మాటలు వినడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వంలో కీలకమార్పులు ఉండే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే బడ్జెట్‌ అంశంపై ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కేసీఆర్ చర్చించారు. త్వరలో 60 రోజుల ప్రణాళిక ద్వారా గ్రామాల్లో వినూత్న పాలనను ప్రజలకు అందించి ఫలితాలు తీసుకురావాలని భావిస్తున్న అధినేత అంతకుముందుగానే కేబినెట్‌లో మార్పుచేర్పులు చేయవచ్చన్న అభిప్రాయం వినబడుతోంది.
ప్రస్తుత కేబినెట్‌లో కాపు, గిరిజన, కమ్మ సామాజికవర్గాలు, మహిళలకు అవకాశం లేకపోగా వీటన్నింటినీ భర్తీచేసేలా మొత్తం కూర్పు ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేటీఆర్, హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డిలకు బెర్త్ కన్ఫర్మ్ అని సమాచారం. వీరు కాకుండా గుత్తా సుఖేందర్ రెడ్డి, జోగు రామన్న, బాజిరెడ్డి గోవర్థన్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, రేగ కాంతారావు, తుమ్మల నాగేశ్వరరావుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.