సీఎంగా కేటీఆర్ తెరపైకి రావడానికి కారణమేంటి?

May 24, 2020

తెలంగాణలో త్వరలోనే రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు... తన కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా ఉన్న తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావును సీఎంగా పగ్గలు అందించబోతున్నారు. ఈ విషయం చాన్నాళ్ల నుంచే వినిపిస్తున్నా... .అప్పుడు, ఇప్పుడూ అంటూ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించిన నేపథ్యంలో ఇంతకంటే మంచి తరుణం ఉండదన్న కోణంలో ఆలోచిస్తున్న కేసీఆర్... కుమారుడికి పాలనా పగ్గాలు అప్పగించేందుకు దాదాపుగా సిద్ధమైపోయారట. అంతేకాకుండా ఇందుకు బ్రహ్మాండమైన ముహూర్తాన్ని కూడా కేసీఆర్ సిద్ధం చేశారట. ఈ దిశగా ఇప్పుడు ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి.

శనివారంతో ముగిసిన మునిసిపల్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసిన టీఆర్ఎస్... 120 మునిసిపాలిటీలకు గానూ ఏకంగా 110 మునిసిపాలిటీలను కైవసం చేసుకుంది. అదే సమయంలో 10 మునిసిపల్ కార్పొరేషన్లలో ఎనిమిదింటిలో గులాబీ జెండా ఎగిరింది. సార్వత్రిక ఎన్నికల్లో తనకు చుక్కలు చూపించిన బీజేపీ, ఓ మోస్తరు ప్రభావాన్ని కనబరచిన కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా మోహరించినా మునిసిపోల్స్ లో ఇంత పెద్ద విజయం దక్కిందంటే... ఈ గెలుపు నిజంగానే గ్రాండ్ విక్టరీగానే చెప్పుకోవాలి. ఇంత పెద్ద విక్టరీ లభించిన తరుణం కంటే... మరే సందర్బం కూడా తన కుమారుడి పట్టాభిషేకానికి మంచి ముహూర్తం ఏముంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో కేటీఆర్ ను సీఎం కుర్చీ ఎక్కించేందుకు కేసీఆర్ సిద్ధమైపోయారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ దిశగా కేటీఆర్ పట్టాభిషేకానికి కేసీఆర్ రెండు ముహూర్తాలను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. వీటిలో మొదటిది వచ్చే నెలలో రానున్న తన 66వ జన్మదినం కాగా... మరొకటి యాదాద్రి ఆలయంలో మార్చి నెలలో నిర్వహించనున్న మహా సుదర్భన యాగ సందర్భమట. ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినమన్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన వచ్చే నెల 17న కేసీఆర్ తన 66వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. అంతేకాకుండా శాస్త్రాలపై ఓ రేంజిలో నమ్మకం ఉన్న కేసీఆర్ కు 6 లక్కీ నెంబర్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈ లెక్కన వచ్చే నెల 17న కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారని ఓ వాదన వినిపిస్తోంది. ఇంకో వాదన ప్రకారం యాదాద్రిని నభూతో అన్న రీతిలో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ మార్చి నెలల అక్కడి పనులను పూర్తి చేసి మహా సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగం సందర్భంగానే ఆలయంలోకి భక్తుల ప్రవేశానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సీఎం హోదాలో యాదాద్రిలో యాగం చేయనున్న కేసీఆర్... ఆ సందర్భంగా తన కుమారుడికి పట్టాభిషేకం చేస్తారని మరో వాదన వినిపిస్తోంది.  

కొసమెరుపు : ఈ వాదనలు బలంగా వినిపిస్తున్నా... సాధారణ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే కేసీఆర్ సీఎంగా ఉన్నా కేటీఆర్  అందరికీ షాడో సీఎంగానే కనిపిస్తున్నారు. ఇంట్లో దాదాపు ఇద్దరు సీఎంలు అయిపోయినట్టు. అలాంటపుడు కేసీఆర్ సీఎం పోస్టు దిగి ఇంట్లో కూర్చుంటే... మళ్లీ అతను సీఎం కాలేడు. అలాంటపుడు అది కేసీఆర్ కు ఏం ఉపయోగం. కొడుక్కు  మర్యాదలకు ఏం తక్కువలేనపుడు కేసీఆర్ ఎందుకు కేటీఆర్ ను ఇప్పటికిపుడు సీఎం చేస్తాడు? అయితే... జాతీయ రాజకీయాలపై గట్టిగా దృష్టి పెట్టాలనుకుంటే మాత్రం ఆ అవకాశం ఉంది.