కేటీఆర్ లెక్క చూడండి! భలేగా చెప్పారు..

January 24, 2020

ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు టీఆరెస్ పార్టీకి ఊహించని విజయాన్ని అందించాయి. దీంతో గులాబీ వర్గాల్లో జోష్ బాగా పెరిగింది. పక్క రాష్ట్రం ఏపీ జోలికి వెళ్తుండటం.. ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నాం అని చెబుతుండటం లాంటి -వాటిని జోరుగా ప్రమోట్ చేసుకుంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి. నామినేషన్ల ఘట్టం కూడా ముగిసిపోయింది. మరో 15 రోజుల్లో తొలి విడత స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలోనే తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 42 ఎంపీ సీట్లకు పోలింగ్ ముగియనుంది. ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండగా... ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలను ముగించుకున్న తెలంగాణలో కేవలం లోక్ సభ స్థానాలకు మాత్రమే పోలింగ్ జరగనుంది.

వరుసగా రెండో సారి తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు... ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అటు ఎన్డీఏతో పాటు ఇటు యూపీఏకు కూడా క్లియర్ మెజారిటీ రాదని అంచనా వేస్తున్న కేసీఆర్.. టీఆర్ఎస్ సహా పలు ప్రాంతీయ పార్టీలు సత్తా చాటే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక ఈ విషయం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఏకంగా ఓ లెక్క చెప్పేశారు. ఈ దఫా కేంద్రంలో అటు ఎన్డీఏ ఇటు యూపీఏ.. రెండు పక్షాలకు కూడా అధికారం ఓ కలే అని ఆయన అన్నారు. మోదీ పాలనను ఈ ఐదేళ్లలో చూసిన జనం పెద్దగా సమ్మోహితులేమీ కాలేదని ఆయన చెప్పారు. ఫలితంగా ఎన్డీఏ ఈ ఎన్నికల్లో పెద్దగా రాణించే అవకాశాలే లేవని అన్నారు. ఎన్డీఏ యూపీఏలతో సమాన దూరం పాటిస్తున్న పలు ప్రాంతీయ పార్టీలకు ఈ దఫా ఏకంగా 150 నుంచి 170 సీట్ల దాకా వస్తాయని ఆయన పేర్కొనడం గమనార్హం. కాబట్టి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఈ పార్టీలే కీలక కానున్నాయని ఆయన జోస్యం చెప్పారు. ఈ పార్టీలన్నీ ఓ ప్లాట్ ఫామ్ మీదకు వస్తే ఫెడరల్ ఫ్రంట్ దే అధికారం అని కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.