​కర్నూలును ఏం చేస్తావు జగన్ ?

August 13, 2020

పాలకులకు పక్షపాతం ఉండకూడదు అని పదవీ ప్రమాణ స్వీకారం రోజు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కానీ అది ప్రమాణానికే పరిమితం. ఆ తరువాత దాని సంగతి అంతే. ప్రపంచంలో పలువురు పెద్ద దేశాల పాలకులకే కరోనా సోకితే అందరికీ చెప్పి వైద్యం చేయించుకున్నారు. అది అందరికీ భరోసాను ఇచ్చింది. కానీ ఒక ఎమ్మెల్యే తన వాళ్ల​కు కరోనా సోకితే రహస్యంగా డాక్టరును ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ క్రమంలో చాలా మందికి కరోనా ముదిరింది. వైద్యం చేసిన డాక్టరు ఫ్యాామిలీయే చనిపోయింది. కానీ... ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం. ఇపుడు ముందుజాగ్రత్త లేకపోవడం వల్ల కర్నూలు జిల్లాలో విపరీతంగా కరోనా వ్యాపించింది. ఇక ముఖ్యమంత్రి చెప్పినా, చెప్పకపోయినా వారు సహజీవనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

తాజాగా ఏపీ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం 71 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసులు 1403కి చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు 1051గా ఉన్నాయి. అయితే... కర్నూలులో అత్యధికంగా ప్రబలింది కరోనా. ఆ ఒక్క జిల్లాలోనే 386 కేసుల నమోదు అయ్యాయి. ముఖ్యంగా కర్నూలు పట్టణంలో అత్యధిక కేసులున్నాయి. కర్నూలు తెలంగాణ సరిహద్దు కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దీనికి వణికిపోతున్నారు. ఎందుకంటే అనేకమంది తెలంగాణ సరిహద్దు ప్రజలు కర్నూలుతో రకరకాల సంబంధాలు కలిగి ఉన్నారు. ఆస్పత్రులు వ్యాపారం, బంధుత్వాలు ఇలా పలు కారణాలతో అక్కడికి వెళ్తు వస్తూ ఉంటారు. ఇక్కడ ఎంత కంట్రోల్ చేసినా... అక్కడి నుంచి మళ్లీ సోకే ప్రమాదం ఉందని తెలంగాణ బయపడుతోంది. అందుకే ఏపీ సరిహద్దులు మూసేయడంతో పాటు గ్రామగ్రామాన తెలంగాణ ప్రజలు కర్నూలుకు వెళ్లొద్దు అంటూ పోలీసులతో ప్రచారం చేయిస్తున్నారు. కొంతకాలం మీరు ఓపిక పట్టండి. అక్కడ చాలా ఎక్కువ ఉంది... మీరు వెళ్తే మళ్లీ రాలేరు. రోగాన్ని మోసుకురావద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు. 

ఇక కేసులు పెరుగుతున్న విధానం చూస్తే ప్రభుత్వం కర్నూలులో కేసులు తగ్గించే ప్రయత్నం పెద్దగా చేయలేదు అని తెలుస్తోంది. లాక్ డౌన్ నిబంధనలు కూడా పెద్దగా పాటించడం లేదు. అందుకే అక్కడ ఇంత దారుణంగా ప్రబలింది అని వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా జాగ్రత్త పడితే... మేలోపు అయినా కంట్రోల్ చేయొచ్చు. జాగ్రత్త పడకపోతే అది ఏపీ మొత్తాన్ని మింగేసే ప్రమాదం ఉంది.