రెండ్రోజుల క్రితం క్షేమం, ఇపుడు నరకం

June 02, 2020

మార్చి నెల మొత్తం ఏపీలో సేఫ్ గా ఉండే జిల్లాల్లో ఒకటిగా కర్నూలు ప్రజలు భావించేవారు. రాష్ట్రంలో ఎన్నికేసులు పెరుగుతున్నా కర్నూలులో మాత్రం అతితక్కువగా ఒకట్రెండు మాత్రమే ఉండేవి. ఇపుడు ఆ కర్నూలు రికార్డు సృష్టిస్తోంది. అన్నీ కరోనా పాజిటివ్ రికార్డులే. మూడు రోజుల క్రితం కేసుల్లో అట్టడుగున ఉన్న కర్నూలు జస్ట్ రెండే రెండు రోజుల్లో టాప్ ప్లేసులోకి చేరింది.

నిన్న 23 కేసులు నమోదు కాగా నేడు మరో 26 కేసులు చేరాయి. దీంతో రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలులో కరోనా బాధితుల సంఖ్య 53కి పెరిగింది. నెల్లూరు, గుంటూరు, కృష్ణా తర్వాతి స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 252 కి పెరిగింది. ఇది ఏప్రిల్ 5 రాత్రి నాటి పరిస్థితి. అదృష్టవ శాత్తూ అనంతపురంలో కేసులు పెరగలేదు. శ్రీకాకుళం, విజయనగరం ప్రజలు ఏ కేసు లేకుండా క్షేమంగా ఉన్నారు. 

అయితే ఏపీ ప్రభుత్వం రిపోర్టులు విడుదల చేస్తున్న తీరు చూస్తే కొత్త అనుమానాలు వస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు రోజుకో బులిటెన్ వదులుతుంటే... ఏపీ ప్రభుత్వం రోజుకు మూడు వదులుతుంది. పైగా కొత్త కేసులు పెరుగుతున్న తీరు చూస్తే రిపోర్టులు ముందే వచ్చినా ప్రజలు భయపడకుండా ఉండేందుకు ఇలా విడదల వారీగా బయటపెడుతున్నారా అన్న అనుమానం కూడా ఉంది. ఎందుకంటే... మార్చి 31 నాటికే మర్కజ్ నుంచి తిరిగి వచ్చిన వారి జాబితా అన్ని రాష్ట్రాల కంటే ముందు ఏపీ పసిగట్టింది. కానీ టెస్టులకు ఇంత ఆలస్యం ఎందుకైంది అనేది రహస్యమే. బహుశా... అన్నీ ముస్లిం మర్కజ్ కేసులే కావడం వల్ల ఒకేసారి బయటపెడితే వారి మీద జనాలు కోపం పెంచుకుంటారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా విడతల వారీగా బయటపెడుతుందనే విమర్శ కూడా ఉంది. 

కర్నూలే దీనికి ఉదాహరణ. అది ఏపీలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా. అక్కడ మర్కజ్ కేసులు నమోదు కాకపోవడమే విచిత్రం అనిపించింది. నేటితో అనుమానం తీరింది. అక్కడి ముస్లిం జనాభాకు అనుగుణంగా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.