''విజయసాయిరెడ్డీ... జీవీఎల్ లా మిగిలిపోతావు''

May 25, 2020

ఎన్నికలు ముగిసినా తెలుగు నేతల మధ్య వార్ ముగియలేదు. ఇంకా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అందరి మీద అసభ్యపదజాలంతో విరుచుకుపడే విజయసాయిరెడ్డి మీద ఈరోజు తెలుగుదేశం నేత, ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలకు నోరు పారేసుకోవడం తప్ప మరోపని లేదని... వారికి అంటిన బురదను అందరికీ అంటించడమే వారి పని అని వ్యాఖ్యానించిన కుటుంబరావు ఈసీ పవర్స్ గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలకు ఓ ప్రశ్న వేశారు. కేంద్ర కేబినెట్ కు లేని కోడ్ ఆఫ్ కాండక్ట్, ఏపీకి మాత్రమే ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్నవి సాధారణ పరిపాలన సమీక్షలు మాత్రమే. ఆయన ఇప్పటికీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. పరిపాలన ఆయన బాధ్యత అన్నారు.
విజయసాయిరెడ్డి అబద్ధాలు మరీ హద్దు మీరాయని... రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల అప్పు ఉందన్నది అబద్ధం అని విజయసాయిరెడ్డిని తప్పబట్టారు. సాయిరెడ్డి వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామని కుటుంబరావు హెచ్చరించారు. మరోవైపు బుద్ధా వెంకన్న కూడా సాయిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మే 23 ఫలితాల తర్వాత విజయసాయిరెడ్డికి కూడా జీవీఎల్ కు పట్టిన గతి పడుతుందని, ఆయన ఎప్పటికీ ట్విట్టర్ స్టార్ గానే మిగిలిపోతారని బుద్ధా వెంకన్న అన్నారు.
జగన్ దుర్యోధనుడు అయితే.. విజయ్ సాయిరెడ్డి శకుని మామ అని విమర్శించారు బుద్ధా వెంకన్న.