ఛాన్స్ వదిలేసుకుంటున్న తెలుగుదేశం

February 26, 2020

చాలా సాధార‌ణ‌మైన రెండు సంఘ‌ట‌న‌లు. కానీ ఎన్నో సారూప్య‌త‌లు. రెండు ప్ర‌ధాన పార్టీల వైఖ‌రులు. తెలుగు రాష్ట్రాల్లో ఆయా పార్టీలు అధికారంలో ఉన్న స‌మ‌యంలో వ్య‌క్త‌మైన అభిప్రాయాలు, ఆయా పార్టీల వ్యూహాలు...వాటి నాయ‌కుల ఎత్తుగ‌డ‌లు, వాటి డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట‌పెట్టే అంశాలు. ఆ రెండు సంఘ‌ట‌న‌ల‌తో లింక్ అయి ఉన్న‌ది ప్ర‌ముఖ కంపెనీ అయిన ఎల్ ఆండ్ టీ. ఆ రెండు రాష్ట్రాలే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. తెలంగాణ‌. ఆ ముఖ్య‌నేత‌లే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు.

ప‌బ్లిక్- ప్రైవేట్ భాగ‌స్వామ్యంలో కేంద్ర సహకారంతో తెలంగాణ ప్ర‌భుత్వం, ఎల్ ఆండ్ టీ సంస్థ‌ నగర పరిధిలో ఎల్బీనగర్‌–మియాపూర్, నాగోల్‌–హైటెక్‌సిటీ మార్గాల్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. తాజాగా ఎల్బీనగర్‌-మియాపూర్‌ మెట్రోలో శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకున్నసమయంలో డోర్‌పైనున్న క్యాబిన్‌ ఊడి ప్రయాణికులపై పడింది.ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గ‌త నెల‌లో అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో పెచ్చులూడి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. కొన్ని స్టేషన్లలో పై నుంచి నీళ్లు కారుతుంటే... బకెట్లు పెట్టింది మెట్రో యాజమాన్యం. ఇది లక్డీకాపూల్ లో కనిపించిన దృశ్యం. నగరంలో మెట్రోకు అనేక చోట్లు ఏడాది రెండేళ్లకే బీటలు వారినట్లు అనేక ఫిర్యాదులు సోషల్ మీడియాలో ఫొటోలతో సహా నమోదయ్యాయి. ఎల్ అండ్ టీ నాణ్యతా లోపంగా పనులు చేస్తోందని జనం సాక్ష్యాలతో ఆరోపిస్తున్నారు. 

ఈ సందర్భంగా కొద్దిరోజుల ఘ‌ట‌న‌ ఒకటి మననం చేసుకుందాం. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఇదే ఎల్ఆండ్‌టీ సంస్థ నిర్మించిన స‌చివాల‌యంలో, అసెంబ్లీల... నిర్మాణంలో లోపాల కార‌ణంగా...వాన నీరు లైక‌న సంగ‌తి తెలిసిందే. దానిపై పెద్ద దుమారం చెలరేగింది. ఆనాడు ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుదే వైఫ‌ల్యం అంటూ ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న వైసీపీ స‌హా వివిధ వ‌ర్గాలు దుమ్మెత్తిపోశాయి. తాత్కాలిక బిల్డింగే కట్టలేని వాడు అమరావతిని కడతాడా అని ఎద్దేవా చేశారు. ప్ర‌భుత్వం అప్ప‌గించిన ప‌నిని ప్రైవేటు కంపెనీ స‌రిగా నిర్వ‌హించ‌పోతే..స‌ర్కారుదే బాధ్య‌త అయింది. ఎల్ అండ్ టీని ఆనాడు ఎవరూ తిట్టలేదు. అందరూ చంద్రబాబునే దూషించారు.

కట్ చేస్తే ప్ర‌స్తుతం తెలంగాణ‌లో నెల వ్య‌వ‌ధిలోనే...రెండు భారీ ప్ర‌మాదాలు...ఒక ప్రాణం అర్ధాంతరంగా గాలిలో క‌లిసిపోతే... దానికి ప్ర‌భుత్వానిది బాధ్య‌త కాకుండా...కంపెనీని ప్ర‌స్తావిస్తున్న ప‌రిస్థితి. దీనికి కేవ‌లం ఆయా రాజ‌కీయ నాయ‌కుల ఎత్తుగ‌డే కార‌ణ‌మ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. పైగా ఎల్ అండ్ టీని హెచ్చరిస్తూ ప్రభుత్వం మైలేజీ కూడా కొట్టేసింది. అదే రాజ‌ధాని అమరావతిలో స‌చివాల‌యం విషయంలో కాంట్రాక్టు సంస్థ చేసిన తప్పిదాన్ని తెలుగుదేశం పార్టీ తన మీదకు రాకుండా చూసుకోలేక పోయింది. ప్రతిపక్షాలు విజయవంతంగా చంద్రబాబును ఈ విషయంలో ప్రజల్లో చులకన చేశాయి. 

త‌మ‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను అదే రీతిలో తిప్పికొట్ట‌లేక‌పోవ‌డం వంటివి చంద్ర‌బాబు చేయ‌లేక‌పోవ‌డం వ‌ల్లే అవి ఆయ‌న మెడ‌కు చుట్టుకున్నాయని ప‌లువురు అంటున్నారు. హైటెక్ ప్ర‌చారంలో తోపు అని అనుకునే తెలుగుదేశం పార్టీ ...ఇలాంటి విష‌యాలు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పాజిటివ్‌ను త‌మ కోణంలో...నెగెటివ్‌ను త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్లుగా టీఆర్ఎస్ పార్టీ చేసుకుంటున్న ప్ర‌చారాన్ని చూసైనా నేర్చుకోవాల‌ని కొంద‌రు ఉచిత స‌ల‌హా ఇస్తున్నారు. అప్పట్లో తమకు సంబంధం లేకపోయినా టీఆర్ఎస్ కార్యకర్తలు లీకేజీల గురించి చంద్రబాబుపై జోకులు వేశారు. కానీ... టీఆర్ఎస్ ఇన్ని తప్పులు చేస్తున్నా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది.

కొసమెరుపు ఏంటంటే... ఎల్ అండ్ టీ సంస్థ ఎదుగుదల వెనుక చాలా మంది కృషి ఉంది. ఎన్నో విలువలు పాటించి ఈస్థాయికి వచ్చిన సంస్థ తనను నిలబెట్టిన విలువలను, క్వాలిటీని విస్మరించడం వల్లే ఈ తప్పిదాలు జరుగుతున్నాయనుకోవచ్చా? లేకపోతే సాధారణ ట్రైనీ మేస్త్రీ కట్టిన గోడ కూడా కట్టిన ఏడాది లోపు పెచ్చులు ఊడిపోదు. కానీ ఎల్ అండ్ టీ సంస్థ కట్టిన గోడలు పెచ్చులూడటం ఏంటి? దానికి ప్రాణాలు పోవడం ఏంటి... ఇలా వరుస సంఘటనలు జరిగితే భవిష్యత్తులో ఎల్ అండ్ టీ తన ప్రభ కోల్పోకుండా ఉండగలదా? మరిన్ని కాంట్రాక్టులు దక్కించుకోగలదా? పేరు చూసి దానికి పనులు అప్పగించి చంద్రబాబు మోసపోయారా?