లగడపాటి ఎగ్జిట్ పోల్స్.. ఏపీలో ఎవరికెన్ని?

July 04, 2020

పోలింగ్ ప్రక్రియలో ఎగ్జిట్ పోల్స్‌కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేశారు అనే ప్రాతిపదికన నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారు. ఎన్నికల ముందు నిర్వహించే ఒపీనియన్ పోల్స్ కన్నా, పోలింగ్ అనంతర ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అసలైన ఫలితాలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఫలితాలపై అందరికీ ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఇదే ఆసక్తి ఆంధ్రప్రదేశ్‌లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికలు జరిగిన అన్ని ప్రాంతాల కంటే ఇక్కడే హోరాహోరీ పోరు జరిగింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా సాగాయి. ఏప్రిల్ 11న ఈ ఎన్నికలకు ఓటింగ్ జరిగింది. తాజాగా వీటికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి.

ముఖ్యంగా ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. గతంలో ప్రకటించినట్లుగా సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన ఫలితాలను ఆయన తిరుపతిలో విడుదల చేశారు. లగడపాటి సంస్థ ఆర్జీ ఫ్లాష్ సర్వే నిర్వహించిన సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీనే మరోసారి ఆంధ్రాలో అధికారం చేపట్టబోతుందని తేల్చారు. ఆ పార్టీకి 90-110 స్థానాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 67- 79 స్థానాలు, జనసేకు 1-3 స్థానాలు వస్తాయని ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాదని సర్వే పేర్కొంది. అలాగే, టీడీపీకి 13-17, వైసీపీకి 8-12, జనసేనకు ఒక ఎంపీ సీటు వచ్చే అవకాశం ఉందని ఆర్జీ ఫ్లాష్ సర్వే తేల్చింది.

చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వల్లే ఈ ఫలితాలు రాబోతున్నాయని సర్వే తేల్చింది. ముఖ్యంగా అన్ని రకాల ఫించన్ల రెట్టింపు, డ్వాక్రా మహిళల కోసం ప్రవేశ పెట్టిన పసుపు- కుంకుమ పథకం, నిరుద్యోగ భృతి, రైతుల కోసం ప్రవేశ పెట్టిన పథకాల వల్ల తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందని ఆర్జీ ఫ్లాష్ సర్వే వెల్లడించింది. అలాగే, తెలంగాణలో టీఆర్ఎస్‌కు 14-16, కాంగ్రెస్‌కు 0-2, బీజేపీ 0-1 దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని సర్వే వెల్లడించింది. అలాగే ఎంఐఎంకు ఒక సీటు వస్తుందని చెప్పింది.

2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 102 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 67, భారతీయ జనతా పార్టీకి 4 సీట్లు వచ్చాయి. మరో రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. దాదాపుగా అవే ఫలితాలు తాజా ఎన్నికల్లోనూ వెలువడే అవకాశాలు ఉన్నాయని సర్వే సంస్థలు తేల్చేశాయి. మరోవైపు, కేంద్రంలో గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారధ్యంలోని ఎన్డీయే కూటమికి 336 స్థానాలు దక్కగా, కాంగ్రెస్ అనుబంధ పార్టీల కూటమి యూపీఏకు 62 ఎంపీ సీట్లు వచ్చాయి. అదే సమయంలో ఇతర పార్టీలకు 145 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత, నరేంద్ర మోదీ మేనియాతో బీజేపీకే ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే.