అది సినిమా ఫంక్షనా..? పార్టీ మీటింగా..?

December 14, 2019

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ఎపిసోడ్‌కు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రారంభం నుంచి దీనిపై బోలెడు అనుమానాలు వస్తున్నాయి. దీనికితోడు ఈ చిత్రానికి వైసీపీ నేత నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఇది వైసీపీ వాళ్ల సినిమానే అనే ముద్ర పడిపోయింది. ఈ వాదనకు సినిమా ప్రారంభ సమయంలోనే అడుగు పడింది. కొద్ది నెలల కిందట లక్ష్మీస్‌ ఎన్టీఆర్ చిత్రం ప్రారంభోత్సవం తిరుపతిలో జరిగింది. శిల్పారామంలో చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ క్లాప్‌ కొట్టి చిత్రం షూటింగును ప్రారంభించారు. అనంతరం లక్ష్మీపార్వతి తదితరులతో కలసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమం ఆద్యంతం వైసీపీ నేతల హడావుడే కన్పించింది.

ముగ్గురు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, పార్టీ నాయకులు ఆదిమూలం, గణపతి నాయుడు తదితరులతో పాటు పలువురు కార్యకర్తలు విచ్చేశారు. ఒకరోజు ముందే జిల్లాలోని వైసీపీ నేతల ఫొటోలతో రామ్‌గోపాల్‌ వర్మకు స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తలు రామ్‌గోపాల్‌వర్మకు అండగా నినాదాలు కూడా చేశారు. దీంతో అందరూ ఈ సినిమా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే తీయిస్తున్నారని, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టేందుకు చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటని అనుకున్నారు. కానీ, దీనిపై వర్మ చాలా సార్లు క్లారిటీ ఇచ్చాడు. రాజకీయ ఉద్దేశంతో కాకుండా ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చక్కగా చూపిస్తామని చెప్పుకొచ్చాడు. అయితే, తాజాగా జరిగిన పరిణామం ఒకటి పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. 

రామ్‌గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్‌ సమర్పణలో రాకేష్‌ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికీ చిత్ర యూనిట్‌తో పాటు వైసీపీ నేతలు కమ్ సినీ నటులు పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్ సహా పలువురు ఆ పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. అంతేకాదు, ఈ కార్యక్రమం మొత్తం వాళ్లంతా నందమూరి తారక రామారావును పొగుడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై పరోక్షంగా విమర్శలు చేశారు. సభా వేదికపై ఆయనను అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై టీడీపీ వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫంక్షన్ చూసిన ఎవరికైనా అది సినిమా ఫంక్షనా..? పార్టీ మీటింగా..? అన్న సందేహం కలిగేలా వాళ్లు వ్యవహరించడం గమనార్హం.