"ల‌లిత‌" గుండు బాస్ స‌క్సెస్ స్టోరీ- షాకింగ్ నిజాలు

June 01, 2020
 
 

గుండుబాస్ గా.. ల‌లితా జ్యువెల‌రీ ఓన‌ర్ గా తెలుగోళ్ల‌కు సుప‌రిచితుడైన కిర‌ణ్ రావ్ వ్యాపారం ఇప్పుడు ఏకంగా ప‌దివేల కోట్ల‌కు చేరింది. ఒక‌ప్పుడు సామాన్యుడిగా ఉన్న ఆయ‌న ఈ రోజు భారీ బిజినెస్ మ్యాన్ గా అవ‌త‌రించారు. త‌న ఉత్ప‌త్తుల‌కు తానే బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మార‌టమే కాదు..త‌న ఇమేజ్ తో ల‌లితా జ్యువెల‌రీస్ కు స‌రికొత్త ఇమేజ్ ను క‌ట్ట‌బెట్టిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. ఈ రోజున ఈ స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న తొలుత త‌న బిజినెస్ స్టార్ట్ చేసింది ఎలానో తెలిస్తే షాక్ తిన‌టం ఖాయం. 

తాను బిజినెస్ ను ఎలా స్టార్ట్ చేసింది కిర‌ణ్ రావ్ మాట‌ల్లోనే చెబితే..

అమ్మ‌కు ఉన్న నాలుగు గాజుల్ని ఆమెకు తెలీకుండా వాటిని క‌రిగించి.. 65 గ్రాముల‌తో కొన్ని జుమ్కీలు చేయించా. వాటిని తీసుకొని చెన్నై వెళ్లా. అక్క‌డ బాగా ఫేమ‌స్ అయిన ల‌లితా జ్యువెల‌రీస్ షాపు ద‌గ్గ‌ర‌కు  వెళ్లి నిలుచున్నా. అప్పుడే ఆ సంస్థ య‌జ‌మాని కంద‌స్వామి కారు దిగుతున్నారు. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి నాకొచ్చిన తెలుగు.. హింది క‌ల‌గ‌లిపి మీ కోసం న‌గ‌లు అమ్మ‌టానికి నెల్లూరు నుంచి వ‌చ్చాన‌ని చెప్పా. 

పన్నెండేళ్ల కుర్రాణ్ణి కదా! ఏదో సరదాపడుతున్నానని అనుకున్నాడేమో ‘సరే చూపించు!’ అన్నారు. ఎర్రటి కాగితంలో చుట్టుకొచ్చిన నా 65 గ్రాముల జుమ్కీలు చూపించాను! రోజూ కిలోల లెక్కన నగలు కొనే ఆయన... వాటిని చూసి నవ్వేశారు. అయినా నన్ను నిరుత్సాహపరచకుండా ‘వీటిని నేను టెస్ట్‌ చేయాలి... రేపు రా!’ అన్నారు. ఇంటికెళితే అందరూ నగల కోసం వెతుకుతూ ఉన్నారు. విషయం చెప్పాను. 

నాన్న అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అమ్మ మాత్రం ‘ఇంట్లో మిగిలిన చివరి నగలవి... నువ్వే ఆలోచించుకో!’ అని మాత్రమే చెప్పింది. తర్వాతి రోజు ఉదయమే మళ్లీ లలితా జ్యువెలరీస్‌కి వెళ్లాను. నన్ను చూడగానే... ‘ఇలాంటివే మరిన్ని చేసుకురా!’ అని చెబుతూ... 15 వేల రూపాయలు డబ్బులిచ్చారు కందస్వామి. వ్యాపారిగా నా తొలి సంపాదన అది! 

అందులో వచ్చిన లాభంతో మరికాస్త బంగారం కొన్నాను. 24 గంటలపాటు తిండీ, నిద్రలన్నీ మాని ఈసారి వంద గ్రాముల నగలు తయారుచేసుకుని వెళ్లాను. సాధారణంగా అలా నగలు తయారుచేయడానికి వారం పడుతుంది. నేను రెండోరోజే ఆయన ముందుకి వెళ్లడం చూసి విస్తుపోయారాయన. క్రమంగా 200గ్రా., 300గ్రా., 1000గ్రా... అలా ఆరునెలల్లోనే మూడు కిలోల బంగారు నగలు చేసిచ్చే స్థాయికి చేరుకున్నాను. ఆ తర్వాతి నుంచీ పూర్తిగా నా దగ్గరే నగలు కొనడం ప్రారంభించారు. 

లలితా జ్యువెలరీస్‌తోపాటూ ఇతర పెద్ద దుకాణాలూ ఆర్డర్‌లు ఇచ్చాయి. దాంతో మొదటి ఏడాదే ఏడు లక్షల రూపాయల వ్యాపారం చేశాను. నేను మేజర్‌ని అయ్యాక అష్రఫ్‌ అనే మిత్రుడి భాగస్వామ్యంతో ‘ఏకే జ్యువెలర్స్‌’ పేరుతో హోల్‌సేల్‌ నగల దుకాణాన్ని రిజిస్టర్‌ చేశాను. ఎనిమిదేళ్లలో దక్షిణాదిలోనే నంబర్‌ వన్‌ హోల్‌సేల్‌ నగల తయారీదారుగా పేరు తెచ్చుకున్నాను. రోజూ కేవలం మూడునాలుగు గంటలే నిద్రపోయేవాణ్ణి. ఆ కఠోర శ్రమే నన్ను పందొమ్మిదేళ్లకే కోటీశ్వరుణ్ణి చేసింది. 

మొదట్లో లలితా జ్యువెలరీస్‌కి నగలు సరఫరా చేయడం కోసం నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లాల్సి వచ్చేది. రాత్రి బస్సులకైతే ఛార్జీ రెండు రూపాయలు తక్కువని వాటినే ఎక్కేవాణ్ణి. లక్షలు సంపాదిస్తున్నప్పుడూ అంతే. ‘లలితా జ్యువెలరీస్‌’ని కొన్నాకే చెన్నైకి మకాం మార్చాను. అక్కడ చెన్నైలోని మా ఇంటి నుంచి దుకాణానికి ఆటోలోనే వెళ్లేవాణ్ని. 

మాకున్న 21 దుకాణాల్లో ఎక్కడా ఛైర్మన్‌గా నాకంటూ ప్రత్యేక గ‌ది ఉండదు. మిగతా ఉద్యోగులతోపాటు స్టోర్‌లోనే కూర్చుంటాను. మా సంస్థ ప్రకటనలని స్టార్‌ హీరోల చేత చేయించకపోవడానికీ అదే కారణం. నేనే నటించాలని అనుకున్నాక మేకప్‌లూ, విగ్గులూ వేసుకోమన్నారు చాలామంది. అది కూడా దండగ ఖర్చు అనిపించే నా గుండుతోనే టీవీల ముందుకు వచ్చేశాను. 

ఇదంతా కేవలం వ్యాపార మనుగడ కోసం ఆచితూచి ఖర్చుపెట్టడం మాత్రమే. కానీ జీవితంలో నాకంటూ కొన్ని కలలుండేవి. కారు కొనడం అందులో మొదటిది! లలితా జ్యువెలరీస్‌ని కొన్న చాలా ఏళ్ల తర్వాతే నేను కారుకొన్నాను. ఆ రోజు దానికి పూజ చేసి రాత్రి ఇంటికి తెచ్చాను. పడుకున్నాక రెండుగంటలకి మెలకువ వచ్చింది. ‘నిజంగానే కారు కొన్నానా... అంత గొప్పవాణ్ణయ్యానా?! కాదు ఇదంతా కలేనేమో!’ అనిపించింది. హడావుడిగా లేచి పార్కింగ్‌కి వెళ్లి కారు డోర్‌ తీసి... హారన్‌ మోగించాక కానీ... నాకు తృప్తిగా అనిపించలేదు.