ప్రశాంత విశాఖలో రాబందుల విహారం

August 10, 2020

ఖాళీ భూమి కనిపిస్తే కబ్జాలే
చుక్కల భూములకూ కాళ్లు
వాటికి ఎన్‌వోసీల కోసం భారీ ఒత్తిళ్లు
అధికారులు వినకపోతే
అమరావతి స్థాయిలో పరిష్కారం
విశాఖ.. మన రాష్ట్రంలోనే కాదు.. యావద్దేశంలోనే ప్రశాంతనగరంగా వాసికెక్కింది. సీఎం జగన్‌ పుణ్యమా అని.. అదిప్పుడు రాబందుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతోంది. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పెడతామని ఆయన ప్రకటించగానే.. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ ఆకాశానికి అంటుతుందని అంతా భావించారు. అదేమీ జరగలేదు సరికదా.. రియల్‌బూమ్‌ బదులు కబ్జాలబూమ్‌ ఏర్పడింది. ఎక్కడ స్థలం ఖాళీగా కనపడితే అక్కడ పులివెందుల బ్యాచ్‌ దిగిపోతోంది. సెటిల్మెంట్లకు బేరమాడుతోంది. అడిగినంత ఇవ్వకపోతే ఆ భూమి/భవంతి/ఇల్లు మీది కాదు.. ఎవరిదోనంటూ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టిస్తోంది. వైసీపీ ప్రజాప్రతినిధులకు హద్దూఅదుపు లేకుండా పోయింది. ఏటా తుఫాన్లు వచ్చినా.. సముద్రం అల్లకల్లోల పరచినా.. ప్రశాంతంగా ఉంటున్న నగరం ఈనాడు కబ్జాల హోరుతో సతమతమవుతోంది. ప్రభుత్వ భూములో, దేవాలయ భూములో స్వాహా చేయడం ఇంతవరకు చూశాం. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు భూములను కూడా లాగేసుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
అమ్మకుంటే ప్రహరీలే..
వైసీపీ ప్రజాప్రతినిధి ఒకరు విశాఖపట్నంలో పేరు మోసిన బిల్డర్‌. ఆయన రాజకీయాల్లోకి రాకముందే విశాఖ నగర శివారున క్రికెట్‌ స్టేడియం ఎదురుగా భారీ వెంచర్‌కు శ్రీకారం చుట్టారు. దానికి అవసరమైన రహదారి కోసం ముందున్న లేఅవుట్‌లో ప్లాట్లు ఉన్నవారిని సంప్రదించారు. వాటిని తనకు అమ్మాలని కోరారు. అక్కడ వుడా వేసే 80 అడుగుల రోడ్డులో ఆ ప్లాట్లు పోతాయని, తనకు ఇస్తే నష్టం ఉండదని చెప్పారు. ఆయన మాటలు నమ్మి కొంతమంది ఇచ్చేయగా, మరికొంతమంది నిరాకరించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేత బంధువుల ప్లాటు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. విషయాన్ని వారు ఆ నేత దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు బిల్డర్‌ను పోలీసులు అరెస్టు చేయడం అప్పట్లో సంచలనమైంది. ఇప్పుడాయన అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో దూకుడు పెంచారు. ప్లాటు ఇవ్వాలని కాశిరెడ్డి పాపయ్యదొర అనే వ్యక్తి కుటుంబంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు అది రాజధాని కూడా అవుతుందని ప్రచారం సాగుతుండటంతో విదేశాల్లో ఉన్న పాపయ్యదొర ఆ స్థలం అమ్మడానికి నిరాకరించారు. దాంతో ఎటువంటి అనుమతుల్లేకుండా ఖాళీస్థలం చుట్టూ ప్రహరీ కట్టారని, సిమెంటు రేకులు వేశారని, వాటిని ఎందుకు కూలగొట్టకూడదో తెలియజేయాలంటూ జీవీఎంసీ అధికారులతో ఆయనకు నోటీసు ఇప్పించారు. నోటీసు చేరకముందే ఆ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీని రాత్రికి రాత్రి కూలగొట్టేశారు. పాపయ్యదొర బంధువులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పదేళ్ల క్రితం కట్టిన ప్రహరీకి జీవీఎంసీ సిబ్బంది ఇప్పుడు నోటీసులు ఇవ్వడం, కూల్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ కూల్చివేతతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరు కూల్చివేశారో తమకు తెలియదని అధికారులు చెప్పారు. ఆ ప్రజాప్రతినిధే కూల్చివేయించారని చెప్పకనేచెప్పారు. నయానో భయానో విశాఖ చుట్టుపక్కల ఎంతలేదన్నా 4,270 ఎకరాలను వైసీపీ నేతలు కబ్జాచేసినట్లు అనధికార వార్తల ద్వారా తెలుస్తోంది. ఇక జగన్‌కు ఆడిటర్‌, వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి గత రెండేళ్లుగా విశాఖలోనే తిరుగుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత పది నెలలుగా ప్రతి 2-3 రోజులకు ప్రత్యక్షమవుతున్నారు. భూములతో పాటు భారీ భవంతులు ఎక్కడున్నాయి.. అవి లీజుకిస్తారా.. అమ్మేస్తారా అని బేరసారాలకు దిగుతున్నారు. అమ్మకపోతే ఆయన అక్కడి నుంచి వెళ్లిన రెండ్రోజులకే పులివెందుల ముఠాలు రంగ ప్రవేశం చేస్తున్నాయి. పిల్లలు/పెద్దలను కిడ్నాపులు చేయడం.. భూ/భవంతుల విక్రయ దస్తావేజులపై సంతకాలు పెట్టించుకోవడం నిత్యకృత్యంగా మారాయని కొందరు పోలీసు అధికారులే అనధికారికంగా అంగీకరిస్తున్నారు. గత ఎనిమిది నెలల్లో ఇది మరింత పెరిగిందని.. దరిదాపుగా 27 వేల ఎకరాల వరకు వైసీపీ నేతల అధీనంలోకి వెళ్లాయని అంటున్నారు.
22-ఎ భూముల మాయాజాలం..
విశాఖ జిల్లాలో 22-ఎ (చుక్కల) భూముల మాయాజాలం నడుస్తోంది. అధికార పార్టీ నేతల భూముల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయు. ఒక సర్వే నంబరులో 100 ఎకరాలు భూమి ఉందనుకుందాం. అందులో ప్రజావసరాలకు 50 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం సేకరించి ఉంటుంది. మిగిలిన 50 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల అఽధీనంలో ఉంటుంది. అయినా ప్రజావసరాలకు సేకరించిన భూమికి సబ్‌ డివిజన చేయాలి. లేకపోతే సర్వే నంబరులో మొత్తం భూమి ప్రభుత్వ భూమిగా నమోదవుతుంది. ప్రస్తుతం జిల్లాలో 22-ఎలో చేర్చిన భూముల్లో ఎక్కువగా ఇటువంటి కేసులే ఉన్నాయి. ఇంకా జిరాయితీ భూమికి ఆనుకుని గోర్జి (దారి), గెడ్డ పోరంబోకు, చెరువులను ఆక్రమించుకుని కొందరు విక్రయాలు చేస్తుంటారు. ఇటువంటి కేసుల్లో భూములను 22-ఎ కింద చేర్చుతుంటారు. ఇటువంటి వాటిని 22-ఎ నుంచి తప్పించాలంటే ఎంత ఆక్రమణకు గురైందో సర్వే చేసి మిగిలిన జిరాయితీ భూమిని యజమానికి బదలాయిస్తారు. విశాఖ జిల్లాలో భూములకు విలువ పెరగడంతో 22-ఎ కింద చేర్చిన భూములకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వీటి విషయంలో అధికారులు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. ఏదైనా ప్రభుత్వ భూమిని 22-ఎ నుంచి మినహాయిస్తూ అడ్డగోలుగా ఆదేశాలు ఇస్తే ఆ తరువాత ఎప్పుడైనా చిక్కుల్లో పడడం ఖాయం. నగరంతోపాటు విశాఖ రూరల్‌, భీమిలి, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, గాజువాక, పరవాడ, అనకాపల్లి మండలాల్లో 22-ఎ దరఖాస్తులపై అధికారులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఇప్పటివకు సుమారు 3,050 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 1,800 దరఖాస్తులనుపరిష్కరించినట్లు తెలిసింది. 800 వరకు తిరస్కరించినట్లు సమాచారం. ఈ తిరస్కరించినవాటిలో అత్యధికం వైసీపీ నేతలవేనని సమాచారం. దాంతో వారు ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి ఏకంగా అమరావతిలోనే ఫైళ్లను పరిష్కరింపజేస్తున్నట్లు తెలిసింది. కీలక ప్రాంతాలైన ముడసర్లోవ, మర్రిపాలెం, మాధవధార, పెదవాల్తేరు, పోతినమల్లయ్యపాలెంతోపాటు మరో రెండుచోట్ల 22-ఎ భూములకు మినహాయింపు తీసుకొచ్చారని ప్రచారం సాగుతోంది.
భూసమీకరణ కోసం సంతకాలు, వేలిముద్రల ఫోర్జరీ
ప్రభుత్వ పెద్దల ‘ఆదేశాల’ను అమలు చేసి, వారి మెప్పు పొందేందుకు కిందిస్థాయి అధికారులు నిబంధనల హద్దులు దాటుతున్నారు. పేద రైతులకు అన్యాయం చేస్తున్నారు. పేదల గృహ నిర్మాణం పేరుతో విశాఖ జిల్లాలో భారీ ఎత్తున భూ సమీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిపై హడావుడిగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. వివరాలేవీ చెప్పకుండానే రైతులతో సంతకాలు, వేలిముద్రలు తీసుకుంటున్నారు. విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతవరంలో ఇటీవల గ్రామసభ నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్‌ సూర్యకళ, ఇతర అధికారులు గ్రామానికి వచ్చారు. ఇక్కడ ఐదు సర్వే నెంబర్లలోని భూములను 105 మంది దళితులు, 124 మంది బీసీలు సాగు చేసుకుంటున్నారు. దళితులకు 1994లోనే పట్టాలు ఇచ్చారు. ఇక బీసీ రైతులు సుమారు 15 సంవత్సరాల క్రితం బీసీ కార్పొరేషన్‌ ఇచ్చిన రుణాలతో తమ భూములకు సాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు. భూములు వీరి సాగులో ఉన్నప్పటికీ పట్టాలు లేవు. ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకుంటున్నామని, దీనికి బదులుగా ఎకరాకు 900 గజాలు చొప్పున అభివృద్ధి చేసి ఇస్తామని అధికారులు ప్రకటించారు. భూ సమీకరణకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేసేందుకు ఫామ్‌-2, అంగీకరిస్తే ఫామ్‌-3 నింపి ఇవ్వాలి. ఇక్కడ అంతా నిరక్షరాస్యులే కావడంతో... చడీచప్పుడు లేకుండా ఫామ్‌-3 పత్రాలపై పేర్లు కూడా రాయకుండానే వేలిముద్రలు వేయించుకుని వెళ్లిపోయారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న సీపీఎం నాయకులు విషయం తెలుసుకుని... అధికారుల దగ్గరకు వెళ్లి ఆ పత్రాలను వెనక్కి తెచ్చారు. వాటిని పరిశీలించి చూస్తే ఏ పత్రాల్లోనూ రైతుల పేర్లు లేవు. వేలిముద్రలు మాత్రం ఉన్నాయి. కొన్నింటిపై రైతుల పేర్ల ఎదురుగా వేలిముద్రలు కనిపించాయి. అయితే... ఆ ముద్రలు తమవి కావని సదరు రైతులు చెప్పారు. భూములు ఇవ్వలేమని రైతులు చెబుతుండగా.. అంగీకార పత్రాలపై వేలిముద్రలు ఎలా తీసుకున్నారని అధికారులను సీపీఎం నేతలు నిలదీశారు. అంటే అన్యాయంగా పేదల భూములు తీసుకుంటున్నారు. రైతుల సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారు. మరోవంక.. ఎక్కడెక్కడ భూమిని సమీకరించాలో వైసీపీ ప్రజాప్రతినిధులు.. రెవెన్యూ అధికారులు మార్గనిర్దేశం చేస్తుండడం గమనార్హం. ఈ భూములు తీసుకుంటున్నది పేదలకు ఇళ్లస్థలాల కోసం కాదని.. వైసీపీ నేతలకు దోచిపెట్టడానికే ఈ తంతు కానిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలా ప్రతి కోణంలో కబ్జాలు చేసేస్తుండడంతో విశాఖవాసులు భయంతో వణికిపోతున్నారు. రాజధాని తమ వద్ద వద్దేవద్దని వారు నెత్తీనోరు కొట్టుకుంటున్నా వినిపించుకునే నాథుడే లేడు.