ఆక్రమణల’ స్వామికి జేజేలు!

August 08, 2020

స్వరూపానందకు భూసంతర్పణ
తిరుమలలో శారదాపీఠం కబ్జాలో
4,817 చ.అడుగులు
క్రమబద్ధీకరణకు ప్రభుత్వ ఆమోదం
ఆలయ భూములే అమ్మాలనుకున్నవారికి
ఇలాంటివో ఓ లెక్కా?
తమిళనాట ఉన్న భూములకు రక్షణ లేదట!
అందుకే విక్రయించాలనుకున్నారట!
ఈ-వేలం కోసం అఽధికారుల నియామకం
దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో వెనుకడుగు


సీఎం జగన్‌కు అత్యంత ఆత్మీయుడైన స్వరూపానందేంద్ర స్వామీజీ ఆధ్వర్యంలోని విశాఖ శారదా పీఠం తిరుమలలో భూములు ఆక్రమించింది. దరిదాపుగా 4,817 చదరపు అడుగులు కబ్జాచేసింది. అయినా తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) బోర్డు అప్పట్లో కళ్లుమూసుకుంది.

స్వాములతో తగవెందుకనుకున్నారో ఏమో చూసీచూడనట్లు ఊరుకున్నారు. ప్రస్తుతం జగన్‌ జమానాలో స్వరూపానంద పలుకుబడి బాగా పెరిగింది. అడిగిందే తడవుగా పీఠానికి విరాళాలు అందుతున్నాయి. పీఠం ఆధ్వర్యంలో జరిగే హోమాలకు దేవదాయ శాఖ నుంచే నిధులు విడుదలవుతున్నాయి.

ఆయన మాటమీదే విశాఖకు రాజధానిని తరలించాలని జగన్‌ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోదది. ఈ నేపథ్యంలో తిరుమలకొండపై కబ్జా చేసిన భూములను క్రమబద్ధీకరించుకోవడం స్వామీజీకి ఓ లెక్కా? ఆ భూములను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి అనుమతి ఇచ్చింది.


ఇది భావ్యమా?


నిజానికి తిరుమలలో అంగుళం భూమి దక్కించుకోవాలన్నా సాధ్యంకాదు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న పలు హిందూ మఠాలకు తిరుమలలో టీటీడీ లీజు ప్రాతిపదికన స్థలాలను కేటాయించింది. ఈ క్రమంలో మౌన స్వామి మఠానికి, శారదా పీఠానికి కూడా భూములు కేటాయించారు.

అక్కడ సంబంధిత మఠాలు భారీ భవంతులు నిర్మించుకున్నాయి. దీనికోసం కేటాయించిన విస్తీర్ణాలకు మించి అదనంగా భూమిని ఆక్రమించాయి. మౌనస్వామి మఠం నిర్వాహకులు 1,870 చదరపు అడుగులు, విశాఖ శారదా పీఠం నిర్వాహకులు 4,817 చదరపు అడుగులు చొప్పున అదనంగా ఆక్రమించారు.

గత డిసెంబరు 28వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. మౌన స్వామి మఠం ఆక్రమించిన భూమికి చదరపు అడుగు రూ. 374 వంతున, విశాఖ శారదా పీఠం ఆక్రమించిన భూమికి చదరపు అడుగు రూ.964 వంతున లీజు నిర్ణయిస్తూ, క్రమబద్ధీకరించాలని తీర్మానం చేసింది.

ఈ ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది. వివిధ రాష్ట్రాల్లో తిరుమలేశుడికి ఉన్న భూములను నిర్వహణ కష్టం పేరుతో అమ్మాలనుకున్న టీటీడీ పెద్దలకు ఈ క్రమబద్ధీకరణ లెక్కలోనిదే కాదు.


23 ఆస్తుల విక్రయానికి సై..


తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కొందరు దాతలు స్వామివారికి విరాళంగా ఇచ్చిన 23 ప్రాపర్టీలను విక్రయించాలని నిర్ణయించారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. విపక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే నిర్వహణ లోపం కారణంగా అవి ఆక్రమణలకు గురవుతున్నాయని, అందుకే టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమర్థించుకున్నారు.

టీడీపీ హయాంలో నియమించిన బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని.. తాము దానినే ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ ఆస్తుల వేలానికి 2016లో అప్పటి బోర్డు నిర్ణయం తీసుకున్నప్పటికీ టీటీడీ అధికారులు అమలు చేయలేదు.

ఇది జరిగిన నాలుగేళ్లకు తాము అమలు చేస్తున్నామని చెప్పడంలో ఆంతర్యమేంటో ఆయనే చెప్పాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు అధికారిక బృందాలను టీటీడీ ఏర్పాటుచేసింది. సదరు 23 ఆస్తుల విక్రయ బాధ్యతలను వాటికి అప్పగించారు.

నిజం ఇది కాగా.. కేవలం పరిశీలనకే వారిని నియమించామని సుబ్బారెడ్డి వాదించారు. దాతల మనోభావాలను దెబ్బతీస్తూ.. కొందరు వైసీపీ నేతలకు కారుచౌకగా ఆ ఆస్తులను కట్టబెట్టాలనుకుంటున్నారన్న ఆరోపణలు వాస్తవమేనని ఇలాంటి వ్యాఖ్యలతో భావించాల్సి వస్తోంది.

వాస్తవానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు టీటీడీలో ప్రత్యేకంగా ఎస్టేట్‌ విభాగం ఉంది. దాతలిచ్చిన భూముల నిర్వహణ దీని బాధ్యత. సిబ్బంది చాలకపోతే మరికొందరిని అదనంగా నియమించుకుని ఆ భూములను కాపాడాలి.

అంతేకాదు.. టీటీడీ ధార్మిక సంస్థ. వాణిజ్యపరంగా లాభసాటా కాదా అనేది యోచించకూడదు. దీనిపై బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. బోర్డు ఆహ్వానితుడైన బీజేపీ ఎంపీ రాకేశ్‌ సిన్హా కూడా సీఎంకు లేఖ రాశారు.

శ్రీవారి ఆస్తుల విక్రయం సముచితం కాదని.. హిందూ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని హెచ్చరించారు. రాష్ట్రంలోని పలువురు పీఠాధిపతులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తమ వాదన తేలిపోవడం.. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో సీఎం జగన్‌ నష్టనివారణకు దిగారు.

టీటీడీ ఆస్తుల అమ్మకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే తమిళనాడు, ఆంధ్ర, హృషీకేశ్‌లలో ఉన్న శ్రీవారి ఆస్తుల విక్రయంపై ప్రస్తుత బోర్డు తాజా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

భక్తులు, దాతలు, స్వాములను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.