భూముల దందా!

August 03, 2020

పేదలకు ఇళ్ల స్థలాల మాటున ప్రజాధనం స్వాహా
వైసీపీ నేతలకు కాసులు కురిపిస్తున్న పథకం
పనికిమాలిన భూములు లక్షలకు కొనుగోలు
తర్వాత కోట్లలో ప్రభుత్వానికి విక్రయం
అసలు సిసలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఖరారు చేయబోతున్నారన్న విషయాన్ని చంద్రబాబు ముందుగానే టీడీపీ నేతలకు లీక్‌ చేశారని.. దాంతో వారు పలు చోట్ల తక్కువ ధరకే అక్కడ భూములు కొనుగోలు చేశారని.. ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండగా అడ్డగోలు ఆరోపణలు చేశారు..

తీరా తాను అధికారంలోకి వచ్చాక ఊరూరా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు లాకులెత్తేశారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం పేరుతో 25 లక్షల మంది పేదలకు గ్రామాల్లో అయితే సెంటున్నర, పట్టణాల్లో అయితే సెంటు చొప్పున స్థలం ఇస్తామని ప్రకటించారు.

ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 38,853 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించింది. ఇవి 14 లక్షల మందికి సరిపోతాయి. అది అలా ఉంచితే ప్రైవేటు భూములు సేకరించిన తీరే ఇప్పుడు రాష్ట్రమంతా ఆందోళన కలిగిస్తోంది.

పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఫలానా చోట ప్రభుత్వం భూములు కొనే అవకాశముందని వైసీపీ నేతలు ముందే తెలుసుకున్నారు. గ్రామాల్లో భూములకు ఎక్కువ ధర ఉండడంతో గ్రామాలకు దూరంగా శ్మశానాల వద్ద, వాగులు, వంకలు, చెరువుల సమీపంలోని భూములపై వారు కన్నేశారు.

వాటిని చౌకగా కొనేసి.. ప్రభుత్వానికి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధికారులతో ఇంకొందరు కుమ్మక్కై.. సొంత భూములను భారీ ధరకు కొనుగోలు చేయిస్తున్నారు. కొందరు రైతులు, డీ-పట్టాదారులతో ముందుగానే ఒప్పందానికి వచ్చి...

వారి భూములనే అధిక ధరకు కొనుగోలు చేసేలా భూసేకరణ నోటిఫికేషన్‌ ఇప్పిస్తున్నారు. ‘మీ భూములకు ఎక్కువ ధర ఇప్పిస్తాం. మాకు కమీషన్‌ ఇవ్వండి’ అని దళారీ అవతారమెత్తుతున్నారు. ఇలా కొత్త పంథాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరుగుతోంది.


కోట్లకు కోట్లే..


సొంత భూములను అధిక ధరకు కొనేలా చేయడం, రైతుల నుంచి కమీషన్లు దండుకోవడం, ముందుగానే తక్కువ ధరకు భూములు కొని, అవే భూములను సర్కారుకు అధిక ధరకు అంటగట్టడం! ఇలా ఒక్కోచోట  ఒక్కోరకం దందా నడిచింది.

స్థానిక నాయకులు కొందరు కోట్లలోనే దండుకున్నారు. కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేత ఒకరు ఈ కమీషన్ల తంతును నడిపించారు. ఆయన ఒక్కరే సుమారు రూ.50 కోట్లు తన జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. పెనమలూరు నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం 488 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించారు.

వీటి ధర నిర్ణయంలో గోల్‌మాల్‌ జరిగింది. వణుకూరు గ్రామంలో సేకరించిన భూమి విలువ బహిరంగ మార్కెట్‌ ప్రకారం ఎకరా విలువ గరిష్ఠంగా రూ.60 లక్షలు. కానీ ఈ ధరకు భూములివ్వడానికి రైతులు ముందుకు రావడం లేదని ఎకరాకు రూ.75 లక్షల ధర ఖరారుచేశారు.  

రైతులకు ఎక్కువ ధర లభిస్తే మంచిదే. కానీ అందులో రూ.6 లక్షలు కమీషన్‌ కింద నొక్కేయడమే అసలు ట్విస్టు! కంకిపాడు మండలంలోని ఈడ్పుగల్లు-వేల్పూరు సరిహద్దులో సుమారు 30 ఎకరాలు సేకరించారు. ఇక్కడ ఎకరం రూ.60 లక్షలు ఉంటుంది. కానీ రూ.72 లక్షలుగా నిర్ణయించారు.

ఇక్కడ రైతుల నుంచి ఎకరాకు రూ.10 లక్షలు కమీషన్‌గా కొట్టేసినట్లు తెలిసింది. ఉయ్యూరులో ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.6 నుంచి 15 లక్షల వరకు కమీషన్ల రూపంలో దండుకున్నారు. ఇలా... ఒక్క పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు రూ.50 కోట్లు కమీషన్‌ కొట్టేసినట్లు సమాచారం.

నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండల పరిధిలోని నెక్కలంగొల్లగూడెం గ్రామంలోనూ భారీగా అవకతవకలు జరిగాయి. గ్రామానికి ఆనుకుని ఎకరం భూమి రూ.40 లక్షలకు ఇచ్చేందుకు కొందరు రైతులు ముందుకు వచ్చినా..

అధికారపక్ష ఒత్తిడికి తలొగ్గి ఊరికి దూరంగా చెరువు, శ్మశానం మధ్యన ఉన్న భూమిని రూ.55 లక్షలకు కొనుగోలు చేశారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు అధికారులు, స్థానిక నేతలు సొమ్ములు పంచుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు భూముల సేకరణ కోసం ప్రభుత్వం రూ.800 కోట్లు కేటాయించింది.

దీంతో వైసీపీ నేతలు కొంతమంది రైతులు, డీ-పట్టాదారులతో ముందుగానే రహస్య ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. తహశీల్దార్‌, ఆర్డీవోలను ఒప్పించి.. ఇళ్ల స్థలాలకు తాము సూచించిన భూములనే సేకరించేలా నోటిఫికేషన్‌ ఇప్పిస్తున్నారు. తక్కువ ధర పలికే భూములకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు.

ఆ మేరకు రైతుల నుంచి కమీషన్‌ వసూలు చేస్తున్నారు. అటు డీ-పట్టా భూములకు కూడా ఇతర జిరాయితీ భూముల తరహాలోనే రేట్లు కట్టి దండుకుంటున్నారు. కోటనందూరు మండలం భీమవరపు కోటలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ... రూ.కోటితో ప్రైవేటు భూమి కొనేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓ వైసీపీ నేత కొందరు రైతులకు దక్కే అధిక పరిహారంలో 20శాతం తనకు వచ్చేలా ముందస్తు చెక్‌లు రాయించుకున్నారు.


పల్నాడులో నేతల తీరే వేరు..


గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి తన నియోజకవర్గ పరిధిలో భూ కొనుగోలు వ్యవహారం మొత్తం తానే నడిపించారు. తనకు, తన వాళ్లకు చెందిన 100 ఎకరాల భూమికి ఎక్కువ ధర వచ్చేలా అధికారులను ఒప్పించి భారీగా లాభపడ్డారు.

ఇదే ప్రాంతంలో మరో నియోజకవర్గంలో.. నివాసయోగ్యం కాని ప్రాంతమైనప్పటికీ వైసీపీ నేతల భూములు కావడంతో అధిక ధరలు చెల్లించి కొన్నారు. ఎందుకూ పనికిరాని, పైగా  శ్మశానానికి పక్కన ఉన్న భూములకు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేశారు.

గ్రామానికి దూరంగా ఉండి నివసించేందుకు ఏమాత్రం పనికిరాని చోట ఎకరం రూ.40 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. వాస్తవానికి ఆ భూమి ధర ఎకరం రూ.20 లక్షలు కూడా ఉండదు. వైసీపీకి చెందిన కొందరు చోటా నేతలు దళారుల అవతారమెత్తి సొమ్ములు దండుకుంటున్నారు.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని కాటిగానికాలువ గ్రామ సమీపంలో కొండగుట్టల్లో ఉన్న 108 ఎకరాల భూమిని ఎకరా రూ.19 లక్షల నుంచి రూ.20 లక్షలకు కొనుగోలు చేశారు. ఇక్కడ ఎకరం ధర రూ.5 లక్షలకు మించదని గ్రామ రైతులే చెబుతున్నారు.

ఉరవకొండ పట్టణంతోపాటు మండలంలో 14.79 ఎకరాలు కొనుగోలు చేశారు. మార్కెట్‌ ధర రూ.రూ.4 లక్షల నుంచి రూ.5లక్షల దాకా మార్కెట్‌ ధర ఉండగా.. రూ.28 లక్షలు చెల్లించారు. విడపనకల్లు మండలం హావళిగిలో ఆరున్నర ఎకరాలు కొన్నారు.

రూ.3.5 లక్షల మార్కెట్‌ ధర ఉండగా ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించారు. ఇలా రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొంది.