బాబోయ్ ఏపీ... భూముల రీసర్వేలో పేలిపోయ మాయ

August 10, 2020

వందేళ్ల అనంతరం ఏపీలో భూముల రీసర్వే చేస్తున్నారు. వాస్తవానికి ఇది మంచి పనే. కానీ ఉద్దేశాలు మాత్రం కొంచెం తేడాగా అనిపిస్తున్నాయి. మంగళవారం రెవెన్యూ శాఖ నుంచి ఏపీలో భూములను సమగ్రంగా రీ సర్వే చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పైలట్ ప్రాజెక్టు కింద దీనిని కృష్ణా జిల్లా జగ్గయ్య పేట నుంచి మొదలుపెడుతున్నారు. ఈ ప్రాజెక్టు లక్ష్యం ఏంటంటే... భూములకు ఇక సర్వే నెంబర్లకు బదులు ప్రత్యేక నెంబర్లు ఇస్తారు. ఇవి మనుషులకు ఇచ్చే ఆధార్ కార్డు నెంబర్లలా యునిక్ గా ఉంటాయి. 

పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన జగ్గయ్య పేట ప్రాంతంలో 66761 ఎకరాల భూములున్నాయి. మొదట వీటిని రీసర్వే చేసి కొత్త నెంబర్లు కేటాయిస్తారు. ఇది సక్సెస్ అయ్యాక ఫలితాలను బట్టి రాష్ట్రమంతటా చేస్తారట.  అయితే, ఇక్కడ ఓ భారీ ట్విస్ట్ ఉంది. ఈ భూముల రీసర్వే కోసం 200 కోట్ల 15 లక్షలు కేటాయించారట. అంటే ఒక్కో ఎకరా సర్వేకు 33 వేలు ఖర్చవుతుందా? ఓరి దేవుడా... ఇదేం లెక్క. లోటు బడ్జెట్ రాష్ట్రంలో ఇది ప్రాధాన్యాంశమా? ఏపీ వద్ద ఖజానాలో అన్ని డబ్బులుంటే ఆస్పత్రుల పైనో, స్కూళ్లపైనో, తాగునీటి ప్రాజెక్టులపైనే పెడితే బాగుంటుంది. కానీ ఇలా అత్యవసరం కాని వాటిపై వెచ్చించడం ఆశ్చర్యకరం. 

ఈ డబ్బులతో ఏం చేస్తారయ్యా అంటే... సర్వే కోసం 11 వేల రోవర్స్ కొంటారట. ఇంకా సర్వేకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తారట. ఏంటో... డబ్బును ఎలా ఖర్చుపెట్టాలో జగన్ సర్కారుకు తెలిసినట్లు ఎవరికీ తెలియదు. పైగా ఇంత బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం చేసిన కామెంట్ ఏంటి అంటే... సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో, కొలతల్లో ఏమాత్రం లోపం లేనివిధంగా రీసర్వే పనులు చేపట్టాలని  ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. భలే ఉందండీ మ్యాజిక్. కోట్లు కుమ్మరించి లక్షలు ఖర్చుపెట్టమంటున్నారు... మరి మిగతావెందుకో?