లారెన్స్... షాకింగ్ నిర్ణయం

August 09, 2020

సినిమా వాళ్లే కాదు, చాలా మంది సీఎంకో, పీఎంకో విరాళం ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. కొంతలో కొంత టాలీవుడ్ లో కొందరు స్వయంగా రంగంలోకి దిగి తమ చేతైన సాయం చేసిన వాళ్లు ఉన్నారు కాదనలేం. కార్మికుల కోసం క్రైసిస్ చారిటీ ఏర్పాటుచేసి టీంవర్క్ చేస్తున్నారు. కానీ వీరందరికీ భిన్నంగా స్పందించారు సినీ ప్రముఖుడు, దర్శకుడు లారెన్స్. 

అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చి కృషితో టాప్ డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగిన లారెన్స్ నిరంతరం ఏదో ఒక సామాజిక సేవ చేస్తుంటారు. లక్షలు కోట్లు ఖర్చుపెడుతుంటారు. సేవ చేయడం అది కూడా సొంత డబ్బుతో... లారెన్స్ కు ఇష్టం. తరచు అతను ఎందరికో అండగా నిలబడతాడు. అలాంటి లారెన్స్ ఇంతవరకు కరోనా సాయం ప్రకటించకపోవడంపై చర్చ జరిగింది. అతను పబ్లిసిటీ కోసం పాకులాడే వ్యక్తి కాదు. అందుకే డబ్బులు చేతికి అందేవరకు సైలెంటుగా ఉన్నారు. తాజాగా చంద్రముఖి 2 సినిమాకోసం తనకు ఇచ్చిన 3 కోట్ల అడ్వాన్సు మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు లారెన్స్. ఈ నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 

అది ఎంత బాధ్యతగా ప్రకటించాడు అంటే... తాను నివసిస్తున్న రాయపురంలో పేదలు అన్నార్తులు ఒక్కరు ఆకలితో ఉండకూడదు అని వారి కోసం కోటి రూపాయలు ప్రకటించాడు. ఈ డబ్బును తన బృందంతో తనే స్వయంగా వారి కోసం దగ్గరుండి బృందంలో తాను ఒకడై ఖర్చుపెడతాడు. మిగతా రెండు కోట్లలో 50 లక్షలు డాన్సర్స్ యూనియన్ కి, 50 లక్షలు సినిమా కార్మికుల నిధికి ఇచ్చారు. మిగిలి కోటిలో 50 లక్షలు తమిళనాడు సీఎం ఫండ్ కి, మరో 50 లక్షలు ప్రధాని రిలీఫ్ ఫండ్ కి ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు లారెన్స్.  ఇంత పెద్ద మొత్తంలో అతను విరాళం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. లారెన్స్ నిర్ణయానికి అందరూ శభాష్ అంటున్నారు. అతను కేటాయింపులు కూడా చాలా బ్యాలెన్స్ డ్ గా ఉన్నాయి.