జడ్జికి కరోనా రావాలని శాపం మెట్టారు

June 05, 2020

కోపం వస్తే శాపం పెట్టే తీరు పురాణాల్లో కనిపించేది. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో శాపాలన్న మాట ఎవరినోట వెంట వస్తే.. నవ్వేస్తారు. కరోనా పుణ్యమా అని కొత్త ట్రెండ్ షురూ అయ్యింది. తమకు కోపం వచ్చినంతనే.. అలాంటోళ్లకు కరోనా సోకాలి.. ఇది నా శాపం అన్న మాట కొందరి నోట వినిపిస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట తరచూ ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. తనను.. తన ప్రభుత్వాన్ని తప్పు పట్టేవారి విషయంలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యే ఆయన.. కరోనా శాపం పెట్టటం ఈ మధ్యన ఎక్కువైంది. సారును చూసి స్ఫూర్తి చెందారో? ఆయన మాటల ప్రభావం ఉందో తెలీదు కానీ.. ఒక జడ్జికి ఒక లాయర్ పెట్టిన కరోనా శాపం ఇప్పుడు సంచలనంగా మారింది.
పశ్చిమబెంగాల్ కు చెందిన ఒక లాయర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఒక కేసు విషయంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసే క్రమంలో జడ్జికి కరోనా సోకాలంటూ శాపం పెట్టేశారు. కోల్ కతా హైకోర్టులో మిగిలిన కోర్టుల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ లో విచారణను చేపట్టారు. బస్సు వేలాన్ని నిలిపివేయాలని సదరు లాయర్ కోరారు.
ఈఎంఐలు కట్టలేని బస్సును బ్యాంకు అధికారులు సీజ్ చేసి వేలానికి పెట్టారు. దీనిపై బస్సు తరఫు లాయర్ వకల్తా పుచ్చుకొని.. వేలానికి స్టే ఇవ్వాలని కోరారు. అందుకు జడ్జి జస్టిస్ దీపాంకర్ దత్తా రిజెక్టు చేశారు. దీంతో లాయర్ బిజోయ్ అగ్రహంతో మైక్రోఫోన్ విసిరేస్తూ జడ్జికి శాపనార్థాలు పెట్టారు. దీంతో అంతా షాక్ తిన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. లాయర్ అనుచిత తీరుపై పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఎంత కోపం వస్తే మాత్రం.. కరోనా శాపం పెట్టటం ఏమిటో..?