మోడీని చూసి నేర్చుకోండని ప్రధానులకు చెప్పాడు

August 11, 2020

కరోనాను కట్టడి చేసేందుకు చాలా దేశాలు లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. సామాజిక లేదా భౌతిక దూరం పాటించడం వల్ల మాత్రమే కరోనాను కట్టడి చేయడం సాధ్యమని....అందుకే కొంచెం కఠినంగా ఉన్నా కూడా లాక్ డౌన్ అమలు చేయక తప్పదని చెబుతున్నాయి. అయితే, నిరుపేద, దినసరి కూలీలు, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి, వలస కూలీలు,కార్మికులపై లాక్ డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని మోడీ...అటువంటి వారు ఇబ్బందిపడకుండా పలు చర్యలు చేపట్టారు. జన్ ధన్ ఖాతాల్లో నగదు జమ, పేదలకు మూడు నెలల పాటు ఉచిత గ్యాస్ సిలెండర్, నిత్యావసరాల సరఫరా వంటి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మోడీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్ట‌ర్ టెడ్రోస్ అధ‌న‌మ్ గేబ్రియాసిస్ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, మిగతా దేశాల వారు ప్రధాని మోడీ చర్యలను ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.

భారత ప్రధాని మోడీపై  డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ప్రశంసలు కురిపించారు.లాక్ డౌన్ సయయంలో ప్రజల సంక్షేమం కోసం మోడీ తీసుకున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చిన టెడ్రోస్...మిగతా దేశాల ప్రభుత్వాలను భారత్ మాదిరి చర్యలు చేపట్టాలని కోరారు. భారత ప్రధాని మోడీని ప్రశంసిస్తూ టెడ్రోస్ ట్వీట్ చేశారు. ఆపద సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 24 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారని, 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందిస్తున్నారని అన్నారు. 20 కోట్ల మందికి నగదు బదిలీ చేస్తున్నారని, 8 కోట్ల మందికి ఉచితంగా 3 నెలలకు సరిపడా వంట గ్యాస్‌ సరఫరా చేస్తున్నారని  ట్వీట్ చేశారు. మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇటువంటి సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కరోనా విపత్తు అప్పుడే తొలగిపోలేదని, ప్రపంచవ్యాప్తంగా  క‌రోనా సోకిన వారి సంఖ్య త్వరలోనే 10 ల‌క్ష‌లు దాటుతుందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, లాక్ డౌన్ కచ్చితంగా పాటించాలని, సోషల్ డిస్టన్స్ మెయింటెన్ చేయాలని అన్నారు.