సంచలనం- ఎల్జీ పాలిమర్స్ సీఈవో అరెస్టు

August 08, 2020

విశాఖపట్నం గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు సంబంధించి తాజాగా సంచలన పరిణామం చోటుచేసుకుంది. 

ఎల్జీ పాలిమర్స్ సీఈవోతో పాటు మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్కి జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్ రావుతో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

పలు సెక్షన్ల కింద వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సోమవారం గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సీఎం జగన్ కి తుది నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.

ఈ నివేదికలో సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. దర్యాప్తు నివేదికలోని 4000 పేజీల్లో పలు కీలక విషయాలను పొందుపరిచారు.

అందులో అతిముఖ్యమైన విషయం ఏంటంటే... కేవలం గ్యాస్ మాత్రమే లీక్ కాలేదని, స్టైరీన్ కూడా లీకైందని పేర్కొన్నారు. ఇది కేవలం నిర్లక్ష్యం వల్ల జరిగినట్లు గుర్తించారు. 

ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలను కాపాడం చాలా కీలకమైన విషయమని, అయితే ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ఈ విషయంలో తీవ్ర తప్పిదం చేసిందని వెల్లడించారు.

2019 డిసెంబర్‌లో రిఫ్రిజిరేషన్‌ పైపులు మార్చడం వల్ల కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిందట. దీనిని యాజమాన్యం నిర్లక్ష్యం చేసింది.

ట్యాంకుల్లో ఉష్ణోగ్రత కాపాడటం కంపెనీ ప్రధాన విధి కాగా, దానిని కంపెనీ విస్మరించినట్లు నివేదిక ఇచ్చిన కమిటీ అధ్యక్షుడు నీరబ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. 

విశాఖ శివారులోని ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలో  ఎల్‌జీ పాలిమర్స్‌లో మే 7వ తేదీన తెల్లవారుజామున 2.30 గంటలకు భారీ గ్యాస్ లీకేజీతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

అనంతరం మరొకరు మృతిచెందారు. గాయపడ్డ వారు ఆస్పత్రిలో కోలుకున్నా గ్యాస్ ప్రభావం వారిపై దీర్ఘకాలికంగా కొనసాగనుందని చెబుతున్నారు.