ఎల్జీ పాలిమర్స్‌.. ఇదేం దుర్మార్గం?

August 14, 2020

12 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకోవడమే కాదు.. వందలు, వేలమంది ఆరోగ్యాల మీద తీవ్ర ప్రభావం చూపించింది విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఉదంతం. ఐతే ఈ ఘోరం జరిగి రెండు వారాలు కావస్తున్నా కంపెనీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. విచారణ కమిటీ అంటున్నారు కానీ.. అసలు తీవ్ర నిర్లక్ష్యంతో 12 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన కంపెనీలో ఒక్కరినీ కూడా ప్రాథమికంగా అరెస్టు చేసే ప్రయత్నం జరగలేదు.

చంద్రబాబు సర్కారు అధికారంలో ఉండగా ఇలాంటి ప్రమాదమే జరిగితే.. సదరు కంపెనీపై చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు జగన్. ఇక ఎల్జీ పాలిమర్స్ సంస్థపై చర్యలు తీసుకోకపోవడాన్ని ఇప్పుడు చంద్రబాబు ఆక్షేపిస్తున్నారు. ఐతే ఈ సంస్థ పట్ల కేవలం జగన్ సర్కారు మాత్రమే కాదు.. బాబు ప్రభుత్వం సైతం ఉదాసీనంగా వ్యవహరించిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

జనావాసాల మధ్య ప్లాంటు పెట్టిన ఎల్జీ పాలిమర్స్ సంస్థ.. దశాబ్దానికి పైగా అసలు పర్యావరణ అనుమతులు లేకుండా ప్లాంటును నడుపుతున్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఎల్జీ పాలిమర్స్ సంస్థే స్వయంగా అంగీకరించింది. గ్యాస్ లీక్ విషాదం నేపథ్యంలో విచారణ జరుగుతున్న తరుణంలో ఎల్జీ పాలిమర్స్ పర్యావరణ అనుమతుల కోసం కేంద్రానికి చేసుకున్న దరఖాస్తున్న నిపుణుల కమిటీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలన జరపనుంది.

తమ సంస్థలో పాలిమర్స్ ఉత్పత్తిని 415 టన్నుల నుంచి 655 టన్నులకు పెంచుకోవడానికి నెల కిందటే ఎల్జీ పాలిమర్స్ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. దానిపై ఇప్పుడు పరిశీలన జరుగుతోంది. పదేళ్ల కిందట్నుంచి ఇక్కడ జరుగుతున్న ఉత్పత్తికి తగ్గట్లు పర్యావరణ అనుమతులు లేవని.. కానీ ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని.. కంపెనీ ఏ ఇబ్బందీ లేకుండా కార్యకలాపాలు నడుపుతోందని అంటున్నారు.