సంచలన చట్టం తెచ్చిన సీఎం యోగి

August 14, 2020

సంచలన నిర్ణయాలు తీసుకోవటంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఎంత చురుగ్గా వ్యవహరిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యూపీ లాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. ఏళ్ల తరబడి ఆ రాష్ట్రంలోని నెలకొన్న పరిస్థితుల్ని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఆయన ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారినా ఆయన పట్టించుకున్నది లేదు.

తాజాగా అలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు యోగి. ఇకపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా గోహత్యకు పాల్పడితే సదరు వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష విధించేలా ఆర్డినెన్సును జారీ చేశారు. అంతేకాదు. రూ.5లక్షల జరిమానా కూడా విధించాలని డిసైడ్ చేశారు. అంతేకాదు.. గోవును గాయపర్చినా తీవ్రశిక్ష పడటం ఖాయమని చెబుతున్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా గోవును గాయపరిస్తే.. వారికి ఏడేళ్ల జైలు.. రూ.3లక్షల జరిమానా విధించేలా నిర్ణయాన్ని తీసుకున్నారు.

గోవధ నిషేధ చట్టం 1955ను వేర్వరు సంవత్సరాల్లో సవరించారు. 1958, 1961, 1979, 2002లో వరుసగా ఈ చట్టానికి సవరణలు చేశారు. తాజాగా యూపీ కాబినెట్ తీసుకొచ్చిన ఆర్డినెన్సుప్రకారం గోవులను అక్రమంగా తరలిస్తే వాహన యజమానితోపాటు డ్రైవర్.. ఆపరేటర్ బాధ్యులు అవుతారు.

గో సంరక్షణలో భాగంగా ఆవులకు టైంకు ఆహారం.. నీరు అందించకున్నా నేరమే అవుతుంది.  
వ్యవసాయ రంగంలో గోవులు కీలకపాత్ర పోషిస్తాయి.. వాటిని సంరక్షించటం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. కొసమెరుపు ఏమంటే.. అయోధ్యలో రామ జన్మభూమిలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన రోజే గోహత్య నిషేధచట్టాన్ని తెర మీదకు తీసుకురావటం.. యూపీ సర్కారు ఆర్డినెన్సును విడుదల చేయటం ఆసక్తికరమని చెప్పక తప్పదు.