వంగవీటికి లైన్ క్లియర్.. చక్రం తిప్పిన లగడపాటి

September 17, 2019

కొద్దిరోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ ఏ పార్టీలో చేరబోతున్నారు..? అసలు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు..? అందరూ అనుకుంటున్నట్లు రాధా.. టీడీపీలో చేరుతారా..? లేదా మరో పార్టీలోకి వెళ్తారా..? అసలు ఆయన ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారు..? ఇటీవల అందరిలో తలెత్తుతున్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికనట్లే అనిపిస్తోంది. కృష్ణా జిల్లాలోనే కీలక నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ సీటు ఇస్తాననే హామీ మీదనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణు వైసీపీలో చేరడంతో ఆయనకు సెంట్రల్ టికెట్ ఇస్తున్నట్లు, రాధను అవనిగడ్డ లేదా మచిలీపట్నం లోక్‌సభ స్థానాలో ఏదో ఒకటి తీసుకోవాలని జగన్ ఒత్తిడి తేవడంతో ఆయన వైసీపీని వీడిన విషయం తెలిసిందే.

ప్రస్తుతమున్న పరిస్ధితుల్లో టీడీపీలో చేరడమే మంచిదని చెప్పడంతో పాటు, కొందరు మిత్రుల సూచనలకు అనుగుణంగా ఆ పార్టీలోనే చేరేందుకు సిద్ధమయ్యారు వంగవీటి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పలువురు నేతలను ఆయన వద్దకు పంపి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ, అప్పుడు రాధా మాత్రం టీడీపీలో చేరే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, సీఎం చంద్రబాబు తనను టీడీపీకి గౌరవంగా ఆహ్వానించారని రాధా వెల్లడించారు. 'నీలాంటి వాళ్లు సమాజానికి ఉపయోగపడతార'ని సీఎం అన్నారని ఆయన చెప్పారు. విజయవాడ నగరంలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మీడియా ద్వారా సీఎం చంద్రబాబును వంగవీటి రాధా కోరారు.

ఇక ఆ తర్వాత చాలా రోజులు మౌనంగా ఉండిపోవడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధాకృష్ణకు సంబంధించిన ఓ వార్త ఏపీ రాజకీయాల్లో హల్‌చల్ చేస్తోంది. ఆయన ఆదివారం సాయంత్రం లోగా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని, అనుచరులకు కూడా సమాచారం అందించారని విశ్వసనీయంగా తెలిసింది. విజయవాడలోని నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలన్న రాధా కోరికను చంద్రబాబు తీర్చారని, ఇప్పటికే చాలా మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని సమాచారం. అందుకోసమే వంగవీటి టీడీపీలో చేరనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చేరిక వెనుక మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఇటీవల ఆయన రాధాతో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన విషయం తెలిసిందే.