’’జగన్ మాట విన్నారు... బుక్కైపోయారు !!‘‘

August 14, 2020

రఘురామరాజు... పంచ్ లు మామూలుగా వేయడం లేదు. చాలా  పద్ధతిగా, మర్యాదగా... ఏకే 47తో పేల్చినట్టు పంచులు వేస్తున్నాడు. పక్కలో బెల్లం అనే పదానికి సరైన అర్థం రఘురామరాజు. జగన్ ని అసలు తిట్టడు. పైగా శ్రీ జగన్ గారికి, మా ముఖ్యమంత్రి గారికి అని వైసీపీ నేతల కంటే చాలా మర్యాదగా మాట్లాడతాడు. కానీ ఆయన దింపే ఒక్కో పోటు జగన్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈరోజు ఆయన చేసిన రెండు వ్యాఖ్యలు చూద్దాం.

వ్యాఖ్య 1

ముఖ్యమంత్రి జగన్ గారిని చూసి ఇన్ స్పైర్ అయ్యి బండిపై మాస్కు పెట్టుకోకుండా వెళ్తున్న చీరాల అబ్బాయి కిరణ్ ని పోలీసులు తీవ్రంగా కొట్టడం దారుణం. అతను ఆస్పత్రిలో చనిపోవడం విచారకరం. 

వ్యాఖ్య 2

కరోనాతో సహజీవనం చేద్దామని సీఎం జగన్ గారు పిలుపునిచ్చారు.. ఆయన మాటమీద నమ్మకంతో సహజీవనానికి సిద్ధపడ్డారు ప్రజలు. పాపం ఇవాళ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.  అలా చేయడానికి మన దగ్గరే కాదు, ప్రపంచంలో ఉన్న బెడ్లు సరిపోవు. బెడ్లే కాదు, మందులకు డబ్బులు సరిపోవు, డబ్బులున్నా అందరికీ మందులు దొరకవు

పై రెండు వ్యాఖ్యల్లో ఎక్కడా రఘురామరాజు జగన్ ని తిట్టలేదు. గారు అంటూ మర్యాదగా పలికారు. పైగా ఆయన చెప్పిన ప్రతిమాటా నిజం. మన ప్రజలకు అసలే అవగాహన తక్కువ, నిర్లక్ష్యం ఎక్కువ. జనంలోకి పోవద్దు కరోనా వస్తుంది... ఇంట్లో ఉండండి అంటే ఉండరు. పోనీ వచ్చాక అయినా ధైర్యంగా ఉంటారా అంటే... బంధువులు చనిపోయి భయపడి తాళాలేసుకుంటున్నారు.

అదేదో ముందే జాగ్రత్తగా ఉండొచ్చుగా. కరోనా వచ్చిందని ఒక మహిళని సొంత ఇంటికి రానివ్వని ఘటనలు చూశాం. ఇలాంటి నేపథ్యంలో కట్టుదిట్టంగా కరోనా కంట్రోల్ చేయకుండా సహజీవనం చేయమని పిలుపునివ్వడం దారుణం. దీనివల్ల అంబులెన్సులు రాక, బెడ్ల చాలక జనం రోడ్ల మీద, ఆస్పత్రుల వరండాల్లో చనిపోతున్నారు. 6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రుల్లో80 వేలు కేసులున్నపుడే పరిస్థితి ఇలా ఉంటే... పది లక్షల కేసులు వచ్చినపుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

కాబట్టి... రఘురామరాజు చెప్పినట్లు మనం కరోనాతో కాపురం చేయడానికి సిద్ధపడినా అన్ని బెడ్లు సర్కారు వద్ద లేవు, ప్రైవేటు ఆస్పత్రుల్లో లేవు. దయచేసి ప్రజలు ఎవరి జాగ్రత్తల్లో వారుండాలి. బయట ప్రతి వస్తువు, ప్రతి మనిషికి కరోనా ఉంటే ఆ విషయం మనకు తెలిస్తే ఎంత జాగ్రత్తగా వెళ్లొస్తామో... అంత జాగ్రత్తగా బయటకు వెళ్లి పనిచూసుకుని రావాలి.

అలా కాకుండా కాకుండా సహజీవనం చేయడానికి సిద్ధమైతే... దాని పరిణామాలకు కూడా సిద్ధంగా ఉండాలి.