కోర్టే కాదు, కరోనా కూడా జగన్ కి అడ్డే

June 02, 2020

ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వైరస్ పై సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. వీలైనంత వరకూ అప్రమత్తంగా ఉండాల్సిన నేపథ్యంలో ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్ని ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లుగా ఈసీ రమేశ్ కుమార్ ప్రకటించారు.
మరి.. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ? ఏకగ్రీవాల మాటేమిటి? అన్నది ప్రశ్నగా మారింది. దీనిపై ఈసీ వివరణ ఇస్తూ.. ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియ మొత్తం యథాతధంగా ఉంచుతామని.. ఏకగ్రీవాల్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఏపీలోని స్థానిక ఎన్నికల్ని రద్దు చేయలేదని.. కేవలం వాయిదా మాత్రమే వేస్తున్న విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారు.
జెడ్పీటీసీ.. ఎంపీటీసీలుగా ఎన్నికైన వారు కొనసాగుతారన్న ఆయన.. ఎన్నికల నిబంధనావళిని కొనసాగిస్తామన్నారు. వాయిదా ప్రక్రియ ముగిసిన తర్వాత మరోసారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ను మళ్లీ ప్రకటిస్తామన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండే అన్ని హక్కులు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఉంటాయన్న ఆయన.. కరోనా కారణంగా రాజకీయ పార్టీలు.. ఇతర సామాజిక సంఘాలు చేసిన సూచనల్ని పరిగణలోకి తీసుకొని వాయిదా నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా చెబుతున్నారు. కరోనా వైరస్ పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని.. స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ను వాడటం వల్ల ఎక్కువ సమయం నిలబడి ఉండాల్సి వస్తుందని.. అందుకే పోలింగ్ ప్రక్రియను వాయిదా వేసినట్లుగా చెబుతున్నారు.