దెబ్బ గట్టిగా తాకిందా - జగన్ వెనుకడుగు?

August 03, 2020

తాను తీసుకునే నిర్ణయాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎంత స్పష్టతతో ఉంటారో తెలిసిందే. ఒకసారి డిసైడ్ అయితే.. ఇక అంతే అన్నట్లుగా ఆయన ధోరణి ఉంటుందన్న మాట పలువురు చెబుతుంటారు. దీనికి తగ్గట్లే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఆయన ససేమిరా అన్నట్లుగా ఉండటం కనిపిస్తుంది.

కరోనా మరింతగా విరుచుకుపడని వేళలో.. స్థానిక ఎన్నికల్ని పూర్తి చేయాలన్న పట్టుదలతో సీఎం జగన్ ఉండేవారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించటం తెలిసిందే. ఎన్నికల్ని వాయిదా వేసే విషయంలో ఆయన నిర్ణయంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే.

ఇదిలా ఉండగా.. స్థానిక ఎన్నికల అంశంపై ఏదోలా తన మాటను నెగ్గించుకోవాలన్నట్లుగా సీఎం జగన్ ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అయితే.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణ మీద తన స్టాండ్ ను మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా గురువారం జరిగిన ఏపీ మంత్రి మండలిలో జగన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా చెబుతున్నారు.

దాదాపు ముప్ఫై ఒక్క అంశాలపై రెండున్నర గంటల పాటు చర్చ సాగిన సమయంలోనే స్థానిక ఎన్నికల అంశం మాటల మధ్యలో వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. కోర్టులో కేసు ఉందిగా.. తీర్పు వచ్చాక చూద్దామని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ఒక మంత్రి తీసుకొచ్చిన ప్రస్తావనను.. ఒక్క మాటలో జగన్ తేల్చేయటం గమనార్హం. ఇటీవల కాలంలో కోర్టు వెల్లడించిన తీర్పులతో పాటు.. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఎన్నికలకు ఏ మాత్రం అనుకూలంగా లేని నేపథ్యంలో.. నాలుగు అడుగులు వెనక్కి వేసేలా జగన్ మాటలు ఉన్నాయని చెబుతున్నారు.