జగన్ దూకుడుకు బ్రేక్...షాకిచ్చిన హైకోర్టు

June 02, 2020

నేను మోనార్క్ ని....నన్నెవరూ మోసం చేయలేరు....నేను చెప్పిందే జరగాలి.....నా మాటే శాసనం....అంటూ ఏపీ సీఎం జగన్ తన ఇష్టా రీతిన పాలన కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. తాను చేసిందే చట్టం...తాను చెప్పిందే వేదం అన్న తరహాలో యువ`మేత` జగన్ తుగ్లక్ పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. తన మాట చెల్లడం లేదన్న అక్కసుతో ఏకంగా శాసనమండలినే రద్దు చేయాలనుకున్న గొప్ప పాలకుడు జగన్. అయితే, మండలితో పాటు పలు నిర్ణయాల్లో కేంద్రాన్ని కూడా ఒప్పించడానికి ప్రయత్నించిన జగన్....చట్టం ముందు చిన్నబోవాల్సిందేనని రుజువైంది. తాజాగా సీఎం జగన్ కు హైకోర్టు షాకిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టివేయడంతో వైసీపీ సర్కార్ కు చుక్కెదురైంది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 50 శాతానికి పైగా రిజర్వేషన్లు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది. బీసీలకు కేటాయించిన 34 శాతం రిజర్వేషన్ ను తిరస్కరించిన న్యాయస్థానం, నెలలోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో, మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్ని`కల` నిర్వహణ జగన్ కు `కల`గానే మిగిలిపోతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, సుప్రీం తీర్పును పెడ చెవిన పెట్టిన జగన్ సర్కార్ 50 శాతానికి మించి రిజర్వేషన్ల ప్రతిపాదన తేవడం వల్ల ఎన్నికలు వాయిదా పడే పరిస్థితి వచ్చింది. ఎన్నికలు వాయి పడితే.....దాని ప్రభావం ఏపీలోని గ్రామాలపై తీవ్రంగా పడనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పునకు జగన్ ఎదురీదడం వల్ల ఏపీకి రావాల్సిన రూ.3200 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి వ‌చ్చింది. గ్రామ‌ పంచాయితీలకు100 శాతం గ్రాంట్ మంజూరు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. దీని ప్రకారం 2018-20 మధ్య రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏపీకి రూ.4,065.79 కోట్లు కేటాయించారు. తొలి విడతగా రూ.858.99 కోట్లు మంజూరు చేశారు. రెండో దఫాలో 3200 కోట్లు రావాల్సి ఉంది. అయితే, 2018లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నిధులను మంజూరు చేయ లేదు. మార్చి 31తో 14వ ఆర్థిక సంఘం గడువు ముగిసిపోతుండటంతో.. ఆ తర్వాత ఈ నిధులు ఏపీకి రాకుండా పోయేచాన్స్ ఉంది.

2020 మార్చి 31లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేకపోతే.. కేంద్రం నుంచి వచ్చే ఈ భారీ నిధులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి 2018 ఆగస్టులో జ‌ర‌గాల్సిన‌ పంచాయతీ ఎన్నికలు...2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. 2020 మార్చి 15లోపు ఎన్నికలు నిర్వహిస్తామని జగన్ ప్రకటించారు. కానీ, మార్చి నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు పాఠ‌శాల‌లు, విధులు నిర్వ‌హించేందుకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండ‌రు. తాజాగా హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో, పరీక్షల నేపథ్యంలో మార్చి 15 కాకపోయినా...మార్చి 31లోపు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ దాదాపు అసాధ్యంగా క‌నిపిస్తోంది. ఏది ఏమైనా....జగన్ అనాలోచిత నిర్ణయం...ఏపీ పాలిట శాపంగా మారిందని చెప్పవచ్చు.