లాక్ డౌన్ 4.0 ... నెవర్ ఎండింగ్, ఎందుకంటే 

August 04, 2020

మనం ఈ వార్త చదివాక ఉసూరుమనాల్సిందే. లాక్ డౌన్ ఎత్తివేయడానికి మోడీ సిద్ధంగా ఉన్నా... చాలా రాష్ట్రాలు సిద్ధంగా లేవని నిన్న వీడియో కాన్ఫరెన్సుతో అర్థమైపోయింది. దీంతో మే 17 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగనుంది. అయితే.... ఆంక్షలు, సడలింపులు పెట్టుకునే అవకాశాన్ని కేంద్రం ఆయా రాష్ట్రాలకు బదలాయించనుంది. దీన్ని బట్టి ఆయా రాష్ట్రాలు తమ వద్ద పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. 

కరోనాను ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడం కూడా మనకు అంతే ముఖ్యం అని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు మనకున్న ఒకే ఒక ఆయుధం... భౌతిక దూరం పాటించడమే అని మోడీ చెప్పారు. భారతదేశానికి ఇప్పుడు కరోనా వ్యాప్తిపై మంచి అవగాహన ఉంది. కాబట్టి సడలింపులు ఇచ్చినా ప్రజలు అప్రమత్తంగా ఉంటారని భావిస్తున్నట్లు ప్రధాని మోడీ అన్నారు. 

లాక్ డౌన్ 4.0 కోసం క-రోనా వ్యాప్తి ఉన్న ప్రాంతాలను పక్కగా గుర్తించి రోడ్ మ్యాప్ తయారుచేసుకోవాలని మోడీ ముఖ్యమంత్రులకు సూచించారు. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడంలో భాగంగా మొదట రైళ్లను మొదలుపెట్టాం. తర్వాత దేశీయ విమానాల గురించి పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విద్యా రంగంలో సాంకేతికతపై ఆధారపడాలని సూచించారు. ప్రపంచ యుద్ధాల కంటే ఎక్కువగా ఇది ప్రపంచాన్ని ప్రభావితం చేసిందని ఆందోళన వ్యక్తంచేశారు. 

వలస కార్మికులను ప్రతి ఒక్కరూ సాదరంగా ఆహ్వానించండి. అదే సమయంలో వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా వారికి ఇబ్బంది కలగని విధంగా వసతి కల్పించాలని మోడీ కోరారు. లాక్ డౌన్ అవసరం లేదని కొందరు వాదించినా మెజారిటీ లాక్ డౌన్ వైపు మొగ్గు చూపడంతో లాక్ డౌన్ 4.0  ఉంటుంది గాని వీలైనన్ని వెసులుబాట్లు కల్పిస్తారని తెలుస్తోంది. రైలు సర్వీసుల ప్రారంభాన్ని కేసీఆర్ తో పాటు అనేక మంది ముఖ్యమంత్రులు తప్పుపట్టారు. అదే విధంగా ఆర్థిక మద్దతు కేంద్రం నుంచి సరిగా లేదని చాలామంది సీఎంలు చెప్పారు.

ఆరోగ్య సేతు యాప్ కి విస్తృత ప్రచారం కల్పించాలని మోడీ, అమిత్ షా సూచించగా... పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విముఖత చూపారు. మే 15 ఏ ప్రాంతాల్లో లాక్ డౌన్ కోరుకుంటున్నారో కేంద్రానికి తెలపాలని మోడీ సూచించారు. అంటే మే 17 వరకు కేంద్రం చేతిలో ఉన్న లాక్ డౌన్ ఇక నుంచి రాష్ట్రాల చేతుల్లోకి రానుందని అర్థమవుతోంది.  ఇంకో విషయం ఏంటంటే... లాక్ డౌన్ 4.0 అనేదానికి ముగింపు తేదీ ఉండదు. వైరస్ ప్రభావం లేదనుకున్నపుడే ఎత్తేస్తారు. లేకపోతే లేదు. కాబట్టి ఈసారి ముగింపు తేదీలుండవు. జోన్ల వారీగా సడలింపులు వస్తుంటాయి, పోతుంటాయి.