తెలంగాణలో మూడో లాక్ డౌన్... సంచలన నిర్ణయాల దిశగా కేసీఆర్

June 03, 2020

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం వైపు అడుగేస్తోంది. మొదట్నుంచి లాక్ డౌన్ మాత్రమే మనల్ని కాపాడగలదు అని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్... మూడోసారి లాక్డౌన్ పైనే మొగ్గు చూపుతున్నారు. గతంలో కూడా లాక్ డౌన్ పొడిగించాలన్న నిర్ణయం మొదట ప్రతిపాదించింది కేసీఆరే. అయితే.. గత మూడు నాలుగు రోజులుగా ఊహించని రీతిలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ఇంకొంచెం పొడిగించాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కేబినెట్ ముందుకు తెచ్చారు కేసీఆర్. అయితే... మళ్లీ రెండు మూడువారాలు అని కాదు... కేవలం మే 7 వరకు పొడిగించాలని కేసీఆర్ మంత్రి వర్గం ముందు ప్రతిపాదన పెట్టారు. అప్పటి లోపు ప్రస్తుతానికి కంటైన్మెంట్లో ఉన్న ప్రాంతాల ఐసోలేషన్ టైం అయిపోతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందో తెలియడం లేదు. అయితే ప్రస్తుతం సడలింపులు చూస్తుంటే..కేంద్రం లాక్ డౌన్ పొడిగించే అవకాశం లేదు.

 

మరోవైపు అద్దె ఇళ్లలో ఉంటున్న లక్షలాది కుటుంబాలకు కేసీఆర్ ఒక గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో పూర్తిగా ఆదాయం కోల్పోయిన అనేక మంది అద్దె కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలల పాటు ఎవరినీ అద్దె అడగవద్దని ఇళ్ల యజమానులకు ఆదేశాలు ఇచ్చే ప్రతిపాదనను కూడా తెలంగాణ మంత్రి వర్గం పరిశీలిస్తోంది. దీనికి ఆమోద ముద్ర వేయడమే తరువాయి. మార్చి అద్దె నుంచి దీనిని వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో ఎలాంటి డోర్ డెలివరీలు మే 7వరకు అనుమతించే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్ ముందున్న ఈ విషయాలను సమావేశం అనంతరం స్వయంగా కేసీఆర్ లైవ్ లో ప్రకటించే అవకాశం ఉంది.