వామ్మో ఏంటీ కేసులు... లాక్ డౌన్ జూన్ దాకా తప్పదా?

August 08, 2020

కేసులు తగ్గుతాయోమో అని ఎక్కడో చిన్న ఆశ. మార్కుల కోసం ఎదురుచూసినట్టు ప్రతిరోజు ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రభుత్వాలకు నిరాశ తప్పడం లేదు. కేసులు విస్తరిస్తూనే ఉన్నాయి. నానాటికీ విజృంభిస్తున్నాయి. మొదట పదులు, ఆ తర్వాత వందలు పెరుగుతూ పోయినా కేసులు ... ఇపుడు ఏకంగా వేలకు చేరుతున్నాయి. ఏకంగా ఒకే రోజు నమోదైన అత్యధిక కేసుల సంఖ్య తొలిసారి 2 వేలు దాటింది. గత 24 గంటల్లో 2487 కొత్త కేసులు నమోదవడం ఇండియాలో భయానక పరిస్థితిని చాటుతోంది. 

ఈ నెంబరు చూస్తుంటే... యూరప్ దేశాలు గుర్తు వచ్చే పరిస్థితి. ఈ దెబ్బతో వేగంగా ఇండియాలో కేసుల సంఖ్య 40 వేలు దాటేసింది. ఒక్కరోజులో 83 మంది చనిపోయారు. కేసుల తీవ్రత పెరగడం, మరణాలు పెరగడం, లాక్ డౌన్లో కూడా భారీగా కేసులు పెరగడం చూస్తుంటే... పరిస్థితి ప్రమాదకరంగా మారినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా 3 స్టేజీలో ఉంది. అక్కడ 12296 కేసులున్నాయి. అంటే దేశంలో నమోదైన కేసుల్లో మూడో వంతు ఆ రాష్ట్రానివే. 

గుజరాత్ లో 5 వేలు, ఢిల్లీలో 4 వేల కేసులున్నాయి. దక్షిణ భారతదేశంలోనే కేసులు కాస్త కంట్రోల్లో ఉన్నాయి. 

మొదటి లాక్ డౌన్ తో కేసులు పూర్తిగా తగ్గిపోతాయని ప్రధాని ఆశించి ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ పరిస్థితి తారుమారైంది. తగ్గకపోగా పెరిగాయి. రెండో లాక్ డౌన్ లో మరింత పెరిగాయి. మూడో లాక్ డౌన్ మొదలవుతుండగానే విజృంభించాయి. అంటే ఇపుడే ఇండియాలో పీక్ స్టేజి మొదలైంది. మరి ఈ పీక్ స్టేజి ఎన్నిరోజులు కొనసాగుతుందో అర్థం కావడం లేదు. అంతర్జాతీ పరిణామాలు చూస్తుంటే పీక్ స్టేజీ 2 వారాలు కొనసాగుతుంది. అంటే మూడో లాక్ డౌన్ ముగిసే వరకు పీక్ స్టేజి ఉంటుంది. పీక్ స్టేజి నుంచి మళ్లీ కేసులు తగ్గి అంతా కుదుట పడటానికి మరో మూడు వారాలు పట్టొచ్చు. అంటే జూన్ వరకు లాక్  డౌన్ పొడగించే అవకాశం ఉంది. దీన్ని బట్టి మన లైఫ్ ప్లాన్ చేసుకోవడం మేలు.