లాక్ డౌన్ సడలింపులు... వారికి బిగ్ బూస్టింగే

August 15, 2020

ప్రాణాంతక వైరస్ కరోనా కట్టడి కోసం యావత్తు ప్రపంచం లాక్ డౌన్ అయిపోయిన వేళ... ఇతర దేశాలతో పోలిస్తే... కనోనా వ్యాప్తి కాస్తంత తక్కువగానే ఉన్న భారత్ లో కూడా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగానే అమలవుతున్నాయి. లాక్ డౌన్ ను మిగిలిన దేశాల కంటే కఠినంగా అమలు చేస్తున్న కారణంగానే భారత్ లో కరోనా వ్యాప్తి అంతగా విజృంభించలేదన్న వాదనలూ లేకపోలేదు. సరే... ఏ వాదనలు ఎలా ఉన్నా.. దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు తొలుత 21 రోజుల లాక్ డౌన్ ను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ... ఆ లాక్ డౌన్ ముగుస్తున్న మంగళవారం నాడు రెండో విడత లాక్ డౌన్ అంటూ 19 రోజుల పాటు లాక్ డౌన్ పాటించక తప్పదని పేర్కొన్నారు. అయితే ఈ లాక్ డౌన్ లో కొన్నింటికి సడలింపు ఉంటుందని, వాటికి సంబంధించి బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఈ సడలింపుల్లో ప్రధానంగా తోపుడు బండ్లపై వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు బిగ్ బూస్ట్ దక్కినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

ఇదివరకే తోపుడు బండ్లపై వ్యాపారం ఓ మోస్తరుగా సాగుతున్నా.. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మరింతగా ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా కట్టడి నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ... జనం బయటకు వస్తే, రైతు బజార్లు, షాపింగ్ మాల్స్ లో గుంపులు గుంపులుగా చేరితే జరిగే ప్రమాదం ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుని క్యూ లైన్లలో రావాలని ఆదేశాలు జారీ చేసినా.. పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఈ వ్యవహారమంతా గడచిన 21 రోజుల లాక్ డౌన్ లో అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రాలు కూడా గుర్తించాయనే చెప్పాలి. అదే సమయంలో ఆరోగ్యం పట్ల .జాగ్రత్తలు ఉన్న వారు మార్కెట్ల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇలాంటి వారి కోసం ఆయా నగరాలు, పట్టణాల్లో చిరు వ్యాపారులు... రోడ్లకు ఇరువైపులా, అపార్ట్ మెంట్ల, గేటెడ్ కమ్యూనిటీల వద్ద చిరు వ్యాపారులు ఒక్కొక్కరుగా కూరగాయలు, పండ్లు తదితర మార్కెట్లను ఓపెన్ చేశారు. వీటి వద్ద కొనుగోళ్లు బాగానే పెరగడంతో పాటు సోషల్ డిస్టెన్స్ ను కూడా బాగానే పాటించారు.

 

 ఈ విషయాలన్నింటినీ గమనించిన ప్రధాని నరేంద్ర మోదీ... బుధవారం నాటి తన ప్రసంగంలో రెండో విడత లాక్ డౌన్ లో మినహాయింపుల గురించి మాట్లాడారన్న వాదన వినిపిస్తోంది. ఈ నెల 20 వరకు లాక్ డౌన్ ను కఠినంగానే అమలు చేసినా... ఆ తర్వాత కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపుల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులకు ప్రత్యేకంగా అనుమతలు, గుర్తింపు కార్డులు ఇచ్చే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. తోపుడు బండ్ల వ్యాపారస్తులకే ఎందుకన్న విషయానికి వస్తే... తోపుడు బండ్లపై దేన్నైనా ఇంటింటికీ తిరిగి అమ్మేయొచ్చు కదా. ఈ తరహా వ్యాపారంలో సోషల్ డిస్టెన్స్ ను ఈజీగానే పాటించేయొచ్చు. అంతేకాకుండా కొత్త వారు కాలనీల్లోకి రావడం దాదాపుగా ఉండదనే చెప్పాలి. అంతేకాకుండా తోపుడు బండ్ల వ్యాపారులకు గుర్తింపు కార్డులను ఇవ్వడం ద్వారా వారిని మానీటరింగ్ చేయడం కూడా సులభమవుతుందనే చెప్పాలి. మొత్తంగా ఇటు కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటుగా ప్రజలకు ఇళ్ల వద్దే సరుకులను, కూరగాయలను అందించడం సులభతరమవుతుంది. ఇదంతా ఆలోచించాకే తోపుడు బండ్లకు మంచి ప్రాధాన్యమిచ్చి ఆ తరహా వ్యాపారాన్ని ప్రోత్సహించాలని చూస్తున్నట్లుగా సమాచారం.