మాటలతో కాదు, కార్టూన్లతో కొడతానంటున్న చినబాబు

June 03, 2020
CTYPE html>
టీడీపీ, వైసీపీ మధ్య ఎప్పుడు పచ్చగడ్డి వేసినా భగ్గుమంటూనే ఉంటుంది. పెద్దస్థాయి నేతలు ఒకరిపై మరొకరు మైకులు పగిలేలా విమర్శలు చేసుకుంటూ చెలరేగిపోతుంటే, కిందిస్థాయి వాళ్లు ఏకంగా బాహాబాహీలకే దిగుతుంటారు. బజారున పడి కొట్టుకుంటుంటారు. ఇక లోకేష్‌ బాబుది సపరేటు రూటు. అధికారం కోల్పోయాక ఆయన మైకుముందుకొచ్చిన సందర్భాలు లేనేలేవు. అన్నీ ట్వీట్ల ఫైట్లే. మాటలు, చేతలు కాకుండా ట్వీట్లతో ప్రత్యర్థులను ఏకేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం వరకు... వైఎస్సార్‌సీపీ ఆగడాలపై ఫొటోలు, వీడియోలు ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ, వాటికి కామెంట్లు జతచేస్తూ విమర్శించిన చినబాబు ఇప్పుడు కాస్త రూటు మార్చారు. అలాగని ట్విట్టర్‌నేం వదిలిపెట్టలేదు. ఫొటోలు వీడియోలకు బదులు కార్టూన్లను జత చేయడం మొదలుపెట్టారు. వంద మాటల్ని చెప్పాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా ఒక్క కార్టూన్‌ను పోస్ట్‌ చేస్తున్నారు. దానికి రెండు లైన్లలో వివరణ ఇస్తున్నారు. ఈ వ్యంగ్యాస్త్రాలు జనంలోకి బాగానే దూసుకుపోతున్నాయి. నెటిజన్ల మధ్య చక్కర్లు కొడుతున్నాయి.

బీసీ రిజర్వేషన్లపై "బాబు టైలర్స్‌, జగన్‌ టైలర్స్" అంటూ నిన్న చినబాబు సంధించిన కార్టూన్‌ బాగానే పేలింది. చంద్రబాబు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే, వైఎస్‌ జగన్‌ దాన్ని 24 శాతానికి కట్‌ చేశారంటూ ఆ కార్టూన్‌లో ఉంది. చంద్రబాబును పర్‌ఫెక్ట్‌ స్టిచ్చింగ్‌ మాస్టర్‌గా సూచించిన లోకేష్, జగన్‌ను సూపర్‌ కటింగ్‌ మాస్టర్‌గా సెటైర్‌ వేశారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీడీపీ సపోర్టర్లు దీన్ని బాగా షేర్‌ చేశారు. ఈ కర్టూన్‌ సూపర్‌ సక్సెస్‌ కావడంతో, అదే ఊపులో లోకేష్‌ తాజాగా "నాడు-నేడు" అంటూ మరొకదాన్ని సంధించారు. ఇందులో రైతు భరోసాపై విమర్శను ఎక్కుపెట్టారు.
చంద్రబాబు హయాంలో రైతు రాజులా వెలిగాడని, జగన్‌ హయాంలో బిక్షగాడిలా మారాడని తాజా కార్టూన్‌లో లోకేశ్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో రైతు హాయిగా నవ్వుతున్నట్లు, జగన్ హయాంలో భిక్షమెత్తుకుంటున్నట్లుగా కార్టూన్ ఉంది. రైతుకు సాయం చేయాల్సిందిపోయి, కట్టుకున్న బట్టలు కూడా జగన్ లాక్కున్నట్లు చిత్రీకరించారు.  ఇక, దీనికి లోకేశ్‌ వ్యాఖ్యానం ఏంటంటే... "రూ.12,500ల రైతుభరోసా, సున్నావడ్డీ రుణాలు, ఉచితబోర్లు, ఉచిత విద్యుత్.. ఇలా అన్నీ కలిపి, ఏడాదికి రైతుకి లక్ష రూపాయలు లబ్ది అన్నారు. లక్ష మాట దేవుడెరుగు.. కనీసం సమయానికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేని అసమర్థ వైకాపా ప్రభుత్వం 10 నెలల్లో 400మంది రైతుల్ని బలితీసుకుంది".