ఆస్తులు పోతాయని.. పార్టీ మారుతున్నారులే 

July 05, 2020

రాజకీయాల్లో వ్యక్తుల పార్టీ మార్పు కొందరికి కలిసొస్తుంది. ఇంకొందరిని పతనం దిశగా నడిపిస్తుంది. అధికారానికి ముందు పార్టీ మారిన వారిక ిపదవులు దక్కితే... అధికారం వచ్చాక పార్టీ మారిన వారికి వ్యాపార స్వప్రయోజనాలు తప్ప పదవీ ప్రయోజనాలు దాదాపు ఉండవు. ఎందుకంటే భయానికి ఎన్నడూ విలువ ఉండదు. తాజాగా తెలుగుదేశం పార్టీ వీడిన దేవినేని అవినాష్, వల్లభనేని వంశీలు పార్టీ ఎందుకు మారారో లోకమంతటా తెలిసిందే. ఎవరెన్ని చెప్పినా ఆ జంపింగులపై ప్రజలకు ఒక ఐడియా ఉంది.  

ఈ జంపింగ్ లపై లోకేష్ స్పందించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఒకరో ఇద్దరే పోతే పార్టీకి పెద్ద నష్టం ఏం వాటిల్లదని... కార్యకర్తల మూలంగా పార్టీ మనగలుగుతుంది కానీ నేతల మూలంగా కాదని లోకేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ ఆర్నెల్లలో పరిపాలన వదిలేసింది. తెలుగుదేశం వారిని ఎలా వేధించాలా అని మాత్రమే ఆలోచిస్తూ పనిచేసుంది. ఆ చేష్టలకు కొందరు భయపడతారేమో గాని... పార్టీ జంకదు. ఒకరిద్దరి వీడ్కోలుతో పార్టీకేమీ కాదు అంటూ లోకష్ వ్యాఖ్యానించారు. 

నేరుగా వంశీ పేరును ప్రస్తావిస్తూ... ఆయన ఆస్తి గొడవల వల్ల పార్టీ మారుతున్నారు. భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి పార్టీ మారారు అని లోకేష్ వ్యాఖ్యానించారు. లోకేష్ వ్యాఖ్యలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోకేష్ దీనిని చాలా క్యాజువల్ గా తీసుకున్నారు అని కొందరు చెబుతుంటే...  ఒకరిద్దరు పోయింది సొంత వాళ్లు కదా అని కొందరంటున్నారు. అయినా.. ఉన్నవాడు సొంతవాడు అవుతాడు గాని పోయేవాడు సొంతవాడు ఎలా అవుతాడు?