చరిత్రలో ఈ రికార్డు ఒక్క జగన్ మీదే ఉంది

July 04, 2020

ఇసుక కొరతతో జనం ఆత్మహత్యలు చేసుకోవడం చరిత్రలో ఒక్క జగన్ పాలనలోనే చూస్తున్నామని తెలుగుదేశం నేత లోకేష్ విమర్శించారు. ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. ఇసుక లేక భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే... శవ రాజకీయాలు అంటూ బరితెగించి మాట్లాడుతున్నారని లోకేష్ విమర్శించారు. జనాల ప్రాణాలుపోతున్నా జగన్ చులకనగా చూస్తున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు.

ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి పాతిక లక్షల పరిహారం ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఇంతవరకు మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి లక్ష రూపాయలు అందిస్తున్నామన్నారు. భవన నిర్మాణ కార్మికుడు వీరబాబు చనిపోవడంతో లోకేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇసుక లేక ఇంతమంది కొట్టుకుంటూ ఉంటే... జగన్ ఏం చేస్తున్నారో తెలుసా? ఇసుక వాటాల కోసం కొట్టుకుంటున్న తన ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య పంచాయతీలు పరిష్కరిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. ముఖ్యమంత్రికి కొంచెం కూడా కనికరం లేదన్నారు.